
కొడుకును కడతేర్చిన తండ్రి
లక్ష్మణచాంద: ఆర్థిక గొడవల కారణంగా తండ్రి కొడుకును కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మండలంలోని మల్లాపూర్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లాపూర్ గ్రామానికి చెందిన బైనం ఎర్రన్న–గంగవ్వ దంపతులకు కుమారుడు అశోక్ (32), కూతురు ఉన్నా రు. కూతురుకు వివాహమైంది. అశోక్‌కు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, తండ్రీకొడుకులు మద్యం సేవించి నిత్యం గొడవ పడేవారు. చంపుతా.. అంటే చంపుతా.. అని పరస్పరం హెచ్చరించుకునేవారు. తండ్రీకొడుకుల మధ్య గొడవ కారణంగా అశోక్ భార్య ఇద్దరు చిన్నారులతో ఆర్నెళ్ల క్రితం లక్ష్మణచాందలోని పుట్టింటికి వెళ్లింది. అశోక్ తరచూ వెళ్లి భార్య, పిల్లలను చూసి వస్తుండేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా అశోక్ భార్య వద్దకు వెళ్లాడు. రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజులాగానే తండ్రితో గొడవ పడ్డాడు. నిత్యం గొడవలతో వేగలేకపోతున్నానని భావించిన ఎర్రన్న మద్యం మత్తులో ఉన్న కొడుకును చంపాలనుకున్నాడు. రాత్రి ఆరుబయట పడుకున్న అశోక్‌ను శుక్రవారం వేకువజామున గొడ్డలితో తల, ముఖంపై నరికాడు. తీవ్ర గాయాలతో అశోక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత గొడ్డలిని సమీప పొలంలో పడేసిన ఎర్రన్న లక్ష్మణచాంద పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిర్మల్ ఏఎస్పీ రాజేశ్‌మీనా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఎర్రన్నను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మాలిక్ రెహమాన్ తెలిపారు. అశోక్‌కు భార్య లక్ష్మి, ఏడేళ్ల కూతురు, ఎనిమిది నెలల పాప ఉన్నారు.
ఆర్థిక గొడవలే కారణం