
నీట్ పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మే 4న నీట్(నేషనల్ ఎలిజిబిలిటి కం ఎంట్రెన్స్ టెస్ట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ ఏ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నీట్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 4న జరిగే పరీక్షకు 1,204 మంది అభ్యర్థులు హాజరవుతారని, ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మంచిర్యాల), తెలంగాణ ఆదర్శపాఠశాల(రాజీవ్‌నగర్), మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. కంట్రోల్ రూమ్, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రశ్నపత్రాలను బందోబస్తుతో భద్రపర్చాలని తెలిపారు. నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఒక్కో పరీక్ష కేంద్రానికి ముఖ్య పర్యవేక్షకుడు, పాలన విభాగం నుంచి ఒక నోడల్ అధికారి, పోలీస్ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చక్రపాణి, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.