
‘గులాబీ’ దండు కదులుతోంది..!
● ఎల్కతుర్తి రజతోత్సవ సభకు సిద్ధం ● వేలాది మంది హాజరయ్యేలా ప్రణాళిక ● వందలాది వాహనాలు ఏర్పాటు చేసిన నాయకులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్) రజతోత్సవ వరంగల్(ఎల్కతుర్తి) బహిరంగ సభకు జిల్లా నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలి వెళ్లనున్నారు. ఆ పార్టీ ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభ విజయవంతానికి ముఖ్య నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల్లో గోడలపై రాతలు, ప్రచారం సాగిస్తున్నారు. వారం రోజులుగా మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్న య్య, బాల్క సుమన్, నాయకులు నడిపెల్లి విజిత్‌రావు తదితరు ఇప్పటికే కేడర్‌ను సిద్ధం చేశారు. జిల్లా నుంచి వేలాదిగా జనాన్ని తరలించి తమ బలం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అన్ని విభాగాల ఇన్‌చార్జీ లు, యువత, మహిళలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులను బస్సులు, కార్లు, ఇతర ప్రైవేటు వాహనాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం నుంచే పెద్దయెత్తున వాహనాల్లో ఎల్కతుర్తి వైపు గులాబీ దండు కదలనుంది.
నియోజకవర్గానికి మూడు వేల మంది
ప్రతీ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది చొప్పున జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8.30గంటల నుంచే వాహనాలను సిద్ధం చేసి 12గంటలకు సభాస్థలికి చేరుకునేలా ప్రణాళిక చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200బస్సులు, 200కార్లు, ఇతర వాహనాలు సమకూర్చుతున్నారు. గ్రామం, పట్టణాన్ని బట్టి ఒకటి నుంచి రెండు, మూడు బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల నియోజకవర్గం నుంచే అధిక సంఖ్యలో హాజరవుతున్నారని నాయకులు చెబుతున్నారు. ఆ మేరకు పట్టణంలో భారీగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట మండలాల వారు వయా రాయపట్నం మీదుగా కరీంనగర్ నుంచి వరంగల్‌కు చేరుకుంటారు. హాజీపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గం, మందమర్రి మండలాల వారు వయా ఇందారం గోదావరిఖని మీదుగా వరంగల్‌కు వెళ్తారు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి మండలాలు వయా కాళేశ్వరం, భూపాలపల్లి, కాటారం మీదుగా సభకు హాజరుకానున్నారు. ఇక ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకున్నారు. వాహనాల్లో చల్లని తాగునీరు, ఓఆర్‌ఎస్, పులిహోర ప్యాకెట్లు, రెండు పూటల భోజన సౌకర్యం కల్పించనున్నారు. మహిళలకు తగిన భద్రత కల్పించనున్నారు.
ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు గ్రామాలు, పట్టణా ల నుంచి పెద్ద ఎత్తున, రైతులు, యువత, మహిళలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మా పార్టీ వారితోపాటు ప్రజలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– నడిపెల్లి విజిత్‌రావు, బీఆర్‌ఎస్ యువ నాయకుడు

‘గులాబీ’ దండు కదులుతోంది..!