
నేలలు నిస్సారం..!
● భూసార పరీక్షలు లేక రైతులకు నష్టం ● జాడలేని భూసార పరీక్ష కేంద్రాలు ● సీజన్‌కు ముందు ఫలితాలతో ప్రయోజనాలు
మంచిర్యాలఅగ్రికల్చర్: రైతులు అధిక పంట దిగుబడి సాధించేందుకు పోటీ పడి ఎరువులు వేస్తున్నా నష్టాలే చవి చూడాల్సి వస్తోంది. భూమిలో పోషక లోపాలు గుర్తించకుండా వేసిన పంటలే వేయడం, అధిక మోతాదులో ఎరువులు చల్లడం వల్ల పంటలపై చీడపీడల దాడి అధికమై సస్యరక్షణ ఖర్చు పెరుగుతోంది. భూములు నిస్సారమై భవిష్యత్‌లో పంటలు వేయడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. నేలలో అంతర్లీనంగా ఉన్న పోషకాలను కాపాడుకోవాలి. భూసారం తెలుసుకోకుండా ఎలాంటి పంటలు సాగు చేసినా దిగుబడి లేక ఆర్థికంగా చతికిల పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరో నెల పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్, మే నెలల్లో భూ సార పరీక్షలు చేయడానికి మట్టి నమూనాల సేకరణకు అనుకూలమైన సమయం. వానా కా లం పంటలు విత్తుకునే సమయానికి ఫలితాలు వస్తే అందుకు అనుగుణంగా విత్తనం, ఎరువులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భూసార పరీక్షల నిర్వహణకు ఆదేశాలు రాలేదు. గత రబీ సీజన్ సమయంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్‌లోని భూసార పరీక్ష కేంద్రానికి తరలించారు.
అధికంగా ఎరువుల వినియోగం
జిల్లాల్లో 3.60 లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో 70శాతం నల్లరేగడి, 20 శా తం ఎర్ర, ఇసుక, చౌడు నేలలు ఉన్నాయి. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు ఉన్నా రైతులు అధికంగా పత్తి, వరి సాగు చేస్తున్నారు. నేల స్వభావం తెలియకుండా అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. పంటకు ఏ మేరకు ఎరువులు అవసరమో రైతులకు అవగాహన ఉండాలి. భూమిలో ఏయే పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో తెలుసుకోవాలంటే భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మట్టి పరీక్షలు నిర్వహిస్తే పోషక లోపాలను గుర్తించవచ్చు. తద్వారా మోతాదులో రసాయన ఎరువులు వాడితే అనవసర ఖర్చు తగ్గించుకోవచ్చు. భూసారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు.
పరీక్షల ఫలితాల ఆధారంగా పంట సాగు మేలు
పంటలు భూమిలోని పోషకాలను ఏ మేరకు ఉపయోగించుకుంటాయనే దానిపై దిగుబడులు ఆధారపడి ఉంటాయి. పోషకాలు ఎక్కువైనా తక్కువైనా ఆశించిన దిగుబడులు రావు. సాధారణంగా రైతులు భాస్వారం, పొటాష్ ఎరువులు సిఫార్సు చేసిన మోతాదు కంటే తక్కువగాను, నత్రజని ఎరువును సిఫార్సు చేసిన మోతాదు కంటే రెండు నుంచి రెండున్నర రెట్లు ఎక్కువగా వేస్తుంటారు. దీనివల్ల పోషకాల సమతుల్యత దెబ్బతింటుంది. నత్రజని ఎరువును అధిక వినియోగం వల్ల పంట విపరీతంగా ఎదిగి పడిపోతుంది. పూత ఆలస్యంగా వస్తుంది. తాలు గింజలు ఎక్కువగా ఉంటాయి. పంట చీడపీడలకు సులభంగా లోనవుతుంది. చివరికి రైతు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏ పంటకు ఏ పోషక పరిమాణంలో అవసరమో తెలుసుకుని తగిన మోతదులో అందించడాన్నే పోషక సమత్యులత అంటారు. భూసార పరీక్షల్లో ఫలితాల ఆధారంగా ఎరువుల మోతాదును సిఫార్సు చేస్తారు.
ఆదేశాలు రాలేదు
వానాకాలం ముందస్తుగా ఏప్రిల్, మే నెలల్లో భూ పరీక్షల నిర్వహణకు ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. రబీ సీజన్ ముందు డిసెంబర్, జనవరి నెలల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో భూసార పరీక్షలకు 4,106 మట్టి నమూనాలు సేకరించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో భూసార పరీక్ష కేంద్రానికి తరలించాం. – కల్పన,
జిల్లా వ్యవసాయ అధికారి
భూసార పరీక్ష కేంద్రం మూత
జిల్లా ఆవిర్భావ సమయంలో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించి మంచిర్యాల వ్యవసాయ మార్కెట్‌లో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయించారు. వివిధ గ్రామాల నుంచి ఏఈవోలు మట్టి నమూనాలు సేకరించి పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులకు సూచనలు చేశారు. 2020లో భారీ వర్షంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భూసార పరీక్ష కేంద్రంలోని యంత్రాలు కాలిపోయాయి. అనంతరం మరమ్మతులు చేయించారు. 2022లో మంజూరైన మెడికల్ కళాశాలను తాత్కాలికంగా వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేయడంతో పరీక్ష కేంద్రం మూతపడింది. అప్పటి నుంచి భూసార పరీక్షలు లేక రైతులకు నేల స్వభావం తెలియకుండా పోతోంది.