
మాదకద్రవ్యాలను నియంత్రించాలి
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: పాఠశాలలు, కళాశాలల విద్యార్థులపై మాదకద్రవ్యాల ప్రభావాన్ని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాన్ని నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాలు, వినియోగం వల్ల కలిగే నష్టాలను ర్యాలీలు, వ్యాసరచన, చిత్రలేఖనం ఇతర వివిధ రకాల పద్ధతులు, మానసిక వైద్య నిపుణుల శిబిరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రగ్స్ రిహ్యాబిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మాదకద్రవ్యాలను అరికట్టేందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ ఎక్కడైనా మత్తపదార్థాల నిల్వ ఉన్నట్లు తెలిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని అన్నారు.
నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో మే 4న నిర్వహించే నీట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నీట్ కేంద్రాన్ని డీసీపీ భాస్కర్, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. పరీక్ష కోసం కంట్రోల్‌రూం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పరీక్ష కో–ఆర్డినేటర్ ప్రసాద్ పాల్గొన్నారు.