పంటల సర్వే.. కాకి లెక్కలే!
మంచిర్యాలఅగ్రికల్చర్: అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతున్నారు. పంటల బీమా అమలుకు నోచుకోక ప్రభుత్వం అందించే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాల్సిన వ్యవసాయ అధికారులు కాగితాలపై అంచనా లెక్కనే వేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నుంచి ప్రభుత్వం సాగు విస్తీర్ణం డిజిటల్ క్రాప్ సర్వే చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు, రుణాలు, ఇతర రాయితీ పథకాలు, పనిముట్లు, పంట నష్టపోతే గుర్తించేందుకు వీలుగా పంట పొలాల్లోకి వెళ్లి లొకేషన్ ఆధారంగా నమోదుకు డిజిటల్ సర్వే ప్రవేశపెట్టింది. కానీ సాగు విస్తీర్ణం నమోదు క్షేత్రస్థాయిలో జరగడం లేదు. సెప్టెంబర్ 30వరకు పంటల నమోదుకు రైతులే ఏఈవో వద్దకు రావాలని, ఆధార్‌కార్డు, పట్టాపాస్ పుస్తకం తీసుకొచ్చి ఏ పంట సాగు చేశారో నమోదు చేసుకోవాలని.. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని సూచించారు. రైతులు ఇచ్చిన వివరాలు, పంటలు మాత్రమే నమోదు చేసుకున్నారు. కొందరు రైతులు అందుబాటులో లేకపోవడం, పట్టాపాస్‌పుస్తకం లేక నమోదు చేసుకోలేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించిందీ లేక నమోదు చేసిందీ లేక కాకిలెక్కలతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. గత జూలై, ఆగస్టులో ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు నీటమునిగాయి. ఆ సమయంలో నష్టం నమోదు, మూడు రోజుల క్రితం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షంతో నష్టం నమోదు తీరు కాకిలెక్కలేనని తెలుస్తోంది. గత నెల 30న 15 మండలాల్లో 2,751మంది రైతులు 3,351 ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుర్తించారు. ఇందులో భీమిని, భీమారం మండలాల్లో దెబ్బతిన్న పత్తి, వరి పంటలను ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడం గమనార్హం. ఆయా మండలాల్లో పంటలు నేలవాలి వరిగొలుసు నీటిలో మునిగాయి. పరిశీలించి నమోదు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాలలో 75 ఎకరాల్లో 45 మంది రైతులు, నస్పూర్ ప్రాంతంలో 75 ఎకరాల్లో 45మంది రైతులు ఒకే పంట వరి నష్టపోయినట్లు గుర్తించారు. హాజీపూర్ మండలంలో వరి పంట 200 ఎకరాలు, 200 మంది రైతులు నష్టపోయారని పేర్కొనడం గమనార్హం.
క్షేత్రస్థాయికి వెళ్లరు.. నమోదు చేయరు..
ప్రతీ సీజన్‌లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం రైతుల వ్యవసాయ అవసరాలు తీరుస్తుంది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట విస్తీర్ణాన్ని క్షేత్రస్థాయిలో గ్రామాల వారీగా నమోదు చేయడంలో వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఏ వారంలో ఏయే పంటలు సాగయ్యాయనే సమాచారం పూర్తి స్థాయిలో లేకపోవడం గమనార్హం. గత వానాకాలం సీజన్ 3.33 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా వేశారు. గత నెలాఖరు వరకు 3.24,551 ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్లు ధ్రువీకరించారు. ఇందులో ప్రధానంగా పత్తి 1,69,397 ఎకరాలు, వరి 1,53,183 ఎకరాల్లో సాగైనట్లు నమోదు చేశారు. గత ఏడాది జైపూర్ మండలంలో వానాకాలం కంటే యాసంగిలో వరి సాగు విస్తీర్ణం, దిగుబడి పెరిగినట్లు వ్యవసాయ అధికారులు తప్పుడు లెక్కలు నమోదు చేశారు. ఓ కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం తప్పుడు లెక్కలను విజిలెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నూర్, కోటపల్లి మండలాల్లోనూ వానాకాలం కంటే యాసంగిలో సాగు విస్తీర్ణం పెరిగినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో జరిగిన అక్రమాలతో సాగు విస్తీర్ణం తీరు బయటపడుతోంది. అక్రమార్కులకు అనుగుణంగా సాగువిస్తీర్ణం పెరిగినట్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో సాధారణంగా వానాకాలంలో సాగు ఎక్కువగా ఉంటుంది. కానీ యాసంగి సీజన్‌లో వరిసాగు పెరిగినట్లు నమోదు చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయాల్లోనే ఉంటూ పంటల నష్టం నమోదు చేస్తుండడంతో నష్టపోయిన వారికి పరిహారం అందకుండా పోతోందని రైతులు వాపోతున్నారు.


