ఒక్క చాన్స్ ప్లీజ్.. మరో చాన్స్ ప్లీజ్.. అనే డైలాగులు మామూలుగా సినిమాల్లో వినిపిస్తుంటాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ పదాన్ని ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా వాడేస్తున్నారు. గతంలో ఏం చేశాం.. గెలిపిస్తే ఏం చేస్తామో చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచేందుకు ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్‌లు చేయడం మొదలు పెట్టారు.
మెదక్: ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నేతలు బిజీబిజీ అయ్యారు. ఎన్నికలకు మరో 50 రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలకు గాలం వేస్తున్నారు. గ్రామా లు, మండలాల్లోని ముఖ్య నేతలు, క్రియాశీలక కార్యకర్తల జాబితా సిద్ధం చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మతో పాటు ఆమె భర్త దేవేందర్‌రెడ్డిలు ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం.
‘అన్నా ..! మరో ఛాన్స్ మాకు ఇవ్వండి. తెలిసో.. తెలియకో మావల్ల ఏదైనా తప్పులు జరిగి ఉంటే అలాంటివి మనసులో పెట్టుకోవద్దన్నా. ప్లీజ్ అన్నా.. ఈసారి మాకు సహకరించండి. మీ మేలు ఎప్పటికీ మరచిపోము. మీరు మా పార్టీలోకి వస్తే సంతోషం.. లేదంటే కాంగ్రెస్‌లోనే ఉంటూ మాకు సహకరించండి అన్నా..’ అంటూ కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను మచ్చిక చేసుకునే పనిలో ఎమ్మెల్యే పద్మ దంపతులు నిమగ్నమయ్యారు.
బీఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ నేతలు..
మెదక్ నుంచి మూడోసారి బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఈ ఎన్నికలలో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే మెదక్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ చిన్నశంకరంపేట మండల అధ్యక్షుడు పోతరాజు రమణ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ తదితర నేతలు గులాబీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.
పట్టణానికి చెందిన మరో నేత మామిళ్ల ఆంజనేయులు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరతానని ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు కూడా కాంగ్రెస్ రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. పద్మను గెలిపించడానికి సహకరించాలని కోరుతున్నారు. కొందరు బీఆర్‌ఎస్ నేతలకు ఎమ్మెల్యేతో ఏర్పడిన విభేదాలను తొలగించడానికి హైకమాండ్ చేసిన ప్రయత్నం ఫలించ లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment