చెట్లనర్సంపల్లి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్‌రావు
సాక్షి, మెదక్: చదువుకున్న బిడ్డలకు నౌకర్లు కావాలే గాని.. పెన్షన్లు కాదని .. ఇంట్లో పిల్లలకు కొలువులు వస్తే పెన్షన్లకు ఆశపడే అవసరం ఎందుకు ఉంటుందో తల్లిదండ్రులు ఆలోచించాలని దుబ్బాక బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పారు.
అలాగే దౌల్తాబాద్, తొగుట మండలాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక యువత తీవ్ర నిరాశలో ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లుగా ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఉద్యోగాలు వస్తే కుటుంబాలు ఆర్థికంగా బాగుపడుతాయి తప్పా ప్రభుత్వాలు ఇచ్చే స్వార్థపూరిత కానుకలతో కాదన్నారు. నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వాన్ని తప్పకుండా సాగనంపుతారన్నారు.
కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు!
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కల్లబొల్లి మాటలు, కథలు చెబుతున్నాడని.. వాటిని ప్రజలు నమ్మి మళ్లీ మోసపోవద్దని రఘునందన్‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని.. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోతో రైతులు, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
మరోసారి ఆశీర్వదించండి..
పేదలు, నిరుద్యోగులు, ఉద్యోగ, కార్మిక, కర్షక వర్గాల తరఫున పోరాడుతున్న తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని రఘునందన్‌రావు కోరారు. నిరుద్యోగులు, అంగన్‌వాడీలు, వీఆర్‌ఏ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయపరంగా దక్కాల్సిన హక్కుల కోసం అనేక పోరాటాల్లో పాల్గొన్నానని, వారితో కలిసి ధర్నాలు, ఆందోళనలు ప్రత్యక్షంగా చేసినట్లు చెప్పారు. అసెంబ్లీలో సైతం పేదలు, నిరుద్యోగులతో పాటు చాలా సమస్యలపై గళం ఎత్తి ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. ప్రశ్నించే గొంతుకను.. కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి మళ్లీ అసెంబ్లీకి పంపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్నారు.
దుబ్బాక అభివృద్ధి కోసమే నా తపన..
‘దుబ్బాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే నా తపన, ఆవేదన, ఆకాంక్ష’ అని రఘునందన్‌రావు అన్నారు. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదురొడ్డి న్యాయపరంగా దక్కాల్సిన నిధులు వచ్చేలా పోరాడుతున్న విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. తాను గెలిచిన 3 ఏళ్లలో నియోజకవర్గంలో ఎంతో మార్పు వచ్చిందో.. అభివృద్ధి ఎలా పరుగెత్తింతో గమనించి మళ్లీ గెలిపించాలని కోరారు. ఈ సారి దుబ్బాకను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతానన్నారు.
బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇస్తే ఆగమవుతాం!
దుబ్బాక ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేసి ఆగం కావద్దని మాధవనేని రఘునందన్‌రావు కోరారు. సోమవారం మాచిన్‌పల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి గ్రామాలతో పాటు తొగుట మండలంలోని వర్ధరాజుపల్లి, కాన్గల్, గుడికందుల గ్రామాల్లో రఘునందన్‌రావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిన బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు.
ఇంటింటి ప్రచారం!
చేగుంటతో పాటు రుక్మాపూర్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఉపసర్పంచ్ రాంచంద్రం సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మ్యాకల రమేశ్, బాలరాజు, నవీన్, స్వామి, ముత్యం, సిద్దిరాములు, శ్రీరాం సిద్దిరాంలు, గణేష్, లావణ్య పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: 'పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు' : రేవంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment