పెన్షన్ డబ్బులు స్వాహా..
బ్యాంకు ఎదుట సొమ్మసిల్లిపడిపోయిన బాధితురాలు
వెల్దుర్తి(తూప్రాన్): వృద్ధురాలి బ్యాంకు అ కౌంట్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ. 12 వేలు కాజేశారు. వైద్య ఖర్చుల కోసం డబ్బులు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా.. ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. మండల కేంద్రం మాసాయిపేటలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన శేషును పెంటమ్మ, పోచయ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. పోచయ్య గతంలోనే మృతిచెందడంతో పెంటమ్మకు ప్రభుత్వం నుంచి వితంతు పెన్షన్ వస్తుంది. అయితే కొన్నినెలలుగా అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని కూతుర్ల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఇటీవల పెన్షన్ డబ్బులు డ్రా చేసుకోవడానికి స్వగ్రామానికి వచ్చింది. స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని సిబ్బంది చెప్పారు. తన ఖాతాలో సుమారు ఆరు నెలల పెన్షన్ డబ్బులు రూ. 12 వేలు ఉండాలని, వాటిని ఇవ్వాలని కోరింది. ఈ విషయమై రెండు, మూడు రో జులుగా బ్యాంకు చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో బుధవారం బ్యాంకు ఎదుట బైఠాయించింది. ఈక్రమంలో నీరసించి కింద పడిపోయింది. తన ఇంటి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు పాస్‌బుక్ దొంగిలించి అందులో వారి ఫొటోను జతపరిచి బ్యాంకు సిబ్బంది సహకారంతో పెన్షన్ డబ్బులు కాజేశారని ఆరోపించింది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నవీన్‌రెడ్డిని వివరణ కోరగా.. పూర్తి విచారణ జరిపి బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బ్యాంకు ఎదుట వృద్ధురాలి ఆందోళన
పెన్షన్ డబ్బులు స్వాహా..
Comments
Please login to add a commentAdd a comment