ఎల్‌ఆర్‌ఎస్.. ఆఫర్
ఎల్‌ఆర్‌ఎస్ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) వేగవంతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ప్రకటించింది. దీనికి మార్చి 31లోపు గడువు విధించింది. పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే నేరుగా ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది.
మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా 21 మండలాలతో పాటు మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఐదేళ్ల కాలంలో 21,459 మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. వీరంతా మీసేవ కేంద్రాల ద్వారా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభం కాగా కోర్టు కేసుతో 2022లో నిలిచిపోయింది. అనంతరం ఈ స్కీంపై ప్రభుత్వం దృష్టి పెట్టలేకపోయింది. 2023లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎల్‌ఆర్‌ఎస్‌పై నిర్ణయం తీసుకుంది. ప్లాట్లను మూడు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సక్రమంగా ఉంటేనే క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పింది. లేకుంటే తిరస్కరిస్తామని తెలిపింది.
ఫీజు చెల్లించింది 144 మంది మాత్రమే
నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 14,756 మంది, గ్రామీణ ప్రాంతంలో 6,703 మంది ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఇందులో మున్సిపాలిటీల పరిధిలో మూడు నెలల వ్యవధిలో అధికారులు 1,129 దరఖాస్తులను పరిశీలించారు. అందులో 282 సక్రమంగా లేవని తిరస్కరించారు. 842 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. కానీ అందులో కేవలం 141 మంది మాత్రమే ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకున్నారు. ఇంకా 701 మంది ముందుకు రాలేదు. అలాగే గ్రామీణ ప్రాంతంలోని 21 మండలాల పరిధిలో 6,703 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు 562 దరఖాస్తులకు అనుమతి ఇవ్వగా.. అందులో కేవలం ముగ్గురు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
వేగవంతం కానున్న ప్రక్రియ..!
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అయితే మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇవ్వడంతో, ఆలోగా పూర్తిస్థాయిలో దరఖాస్తులు పరిశీలించటం సాధ్యమవుతుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్లాట్లను మూడు శాఖల అధికారులు పరిశీలించిన తర్వాతే క్రమబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. 40 రోజుల గడువు మాత్రమే ఉండటంతో దరఖాస్తుదారులు ముందుకు వస్తే అందుకు తగిన ఏర్పాట్లు చేసి, స్పెషల్ డ్రైవ్ చేపట్టే యంత్రాంగం ప్రస్తుతం అందుబాటులో లేదని తెలుస్తోంది.
ప్లాట్ల కొనుగోలుదారులకు 25 శాతం రాయితీ
మార్చి 31 వరకు గడువు
జిల్లావ్యాప్తంగా 21,459 దరఖాస్తులు
పరిశీలన పూర్తయినవి 1,691
Comments
Please login to add a commentAdd a comment