
నిధులు లేక నిస్తేజం!
ఏడాదిగా పల్లెల్లో ప్రత్యేక పాలన
● నిలిచిన ఆర్థిక సంఘం నిధులు
● అప్పులు చేసి పనులు చేయిస్తున్న కార్యదర్శులు
● బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు
మెదక్‌జోన్: నిధులు లేక గ్రామ పంచాయతీలు నిస్తేజంలో పడ్డాయి. ఏడాదికి పైగా ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పైసా నిధులు విడుదల కాకపోవటంతో పంచాయతీల నిర్వహణ భారం కార్యదర్శులపై పడింది. ఇటీవల మెదక్ మండలంలోని ఓ మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తన మెడలోని బంగారు గొలుసును బ్యాంకులో కుదువపెట్టి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. ఆ డబ్బులతో తను విధులు నిర్వర్తించే పంచాయతీ నిర్వహణను నెట్టుకొస్తున్నాడు. ఈ సమస్య ఆ ఒక్క కార్యదర్శిది కాదు.. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పంచాయతీ కారదర్శులది.
జిల్లాలో 493 గ్రామ పంచాయతీలు
జిల్లాలో 493 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో పదుల సంఖ్యలో మేజర్ గ్రామాలుండగా.. వందల సంఖ్యలో చిన్న పంచాయతీలు ఉన్నాయి. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం పలు శాఖలోని సీనియర్ అసిస్టెంట్లను గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా నియమించి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం పాలకమండలి లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడం లేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల రావాల్సిన ఎస్‌ఎఫ్‌సీ నిధులు ఆగిపోయాయి. అయితే 2024 సెప్టెంబర్‌లో స్వచ్ఛదనం.. పచ్చదనం కింద ప్రతి పంచాయతీకి రూ. 50 వేల చొప్పున నిధులు విడుదల చేసింది. దీంతో కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని భావించిన పంచాయతీ కార్యదర్శులు, ఆ చెక్‌లను ట్రెజరీలో జమచేశారు. కానీ ఆ చెక్‌లు పాస్ కావడం లేదని, అకౌంట్లు ఫ్రీజింగ్‌లో ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.
పన్నులు వసూలైనా..
మేజర్ పంచాయతీలతో పాటు పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో ఫ్యాక్టరీల నుంచి వచ్చే సెస్, వృత్తి పన్నులు, షాపుల అద్దెలు, లైసెన్స్ ఫీజులు, ఇంటి పన్నులు, ఇతర ట్యాక్స్‌లు వసూళ్లు అయినప్పటికీ వాటిని నేరుగా ఖర్చు చేయడానికి వీల్లేదు. వాటిని సైతం ట్రెజరీలో జమ చేశాక పంచాయతీ అకౌంట్ నుంచి చెక్ రూపంలో ఆన్‌లైన్ ద్వారా డ్రా చేసుకోవాలి. కానీ ట్రెజరీలో జమ చేసిన వెంటనే ఫ్రీజింగ్ వస్తోందని.. దీంతో పన్నులు వసూలైనా గ్రామాల్లో సైతం ఆర్థిక వెతలు తప్పడం లేదని కార్యదర్శులు వాపోతున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్ల డీజిల్, వీధి లైట్ల ఏర్పాటు, పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్, బ్లీచింగ్ ఫౌడర్, నల్లాల లీకేజీలకు మరమ్మతులు.. ఇలా గ్రామాల్లో అత్యవసరం కోసం ఖర్చు చేసే ప్రతి పైసా పంచాయతీ సెక్రటరీ భరిస్తున్నారు. కాగా కలెక్టర్‌తో పాటు జిల్లాస్థాయి అధికారులు నిత్యం ఏదో ఒక పల్లెను సందర్శిస్తున్నారు. వారు గ్రామాలను సందర్శించినప్పుడు ఏదేని సమస్య కనిపించినా, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నామని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, అధికారులు కార్యదర్శులను మందలిస్తున్నారు. నిర్వహణకు నిధులు లేవని, ఈ సమస్యపై తమకు ఊరట కలిగించాలని పలువురు కార్యదర్శులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment