బీఆర్‌ఎస్‌లో గ్రూప్ వార్!
● నాయకత్వం కోసం నలుగురి ఆరాటం ● విందులతో నాయకుల మచ్చిక ● పోటాపోటీగా పర్యటనలు ● కార్యకర్తలకు సహాయ సహకారాలు
మెదక్ మున్సిపాలిటీ/పాపన్నపేట(మెదక్): ‘కాంగ్రెసోల్లకు ఒక ఎమ్మెల్యే ఉంటే.. ఉంటే మాకు మాత్రం నలుగురు. వారెవరు పిలిచినా వెంట వెళ్లాల్సిందే. లేకుంటే నిష్టూర చూపులు.. సూటి పోటి మాటలు తప్పడం లేదు’అని వాపోయాడు ఓ బీఆర్‌ఎస్ నాయకుడు. దీనిని బట్టి మెతుకుసీమలో గులాబీ రేకులు.. బాకులై గుచ్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో నెలకొన్న పరిణామాలు.. ఎన్నికల అనంతరం కొత్త సమీకరణలకు దారి తీస్తున్నాయి. నాయకత్వ పోరుకు తెరలేపుతున్నాయి.
ఎదురులేని పద్మారెడ్డికి కొత్త చిక్కులు
టీఆర్‌ఎస్ ఆవిర్భవించిన కొత్తలో రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన పద్మారెడ్డి మెతుకుసీమలో ఎదురులేని ఏలికగా నిలిచారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా 2024 ఎన్నికల వరకు పార్టీలో ఆమె చెప్పిందే వేదం. అప్పటివరకు అంతో.. ఇంతో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి నుంచి పోటీ ఎదుర్కొన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి భంగపడ్డ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే వీరి నుంచి ఎన్నికల్లో ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుందని, అప్పట్లో పద్మారెడ్డి ఆశించారు. కాని ఎన్నికల్లో ఓటమి, తదనంతర పరిణామాలు రోజుకు రోజుకు జటిలంగా మారుతున్నాయి. అప్పట్లో అనుచరుడిగా ఉంటాడనుకున్న తిరుపతిరెడ్డి ఇప్పుడు అధి నాయకుడిగా ఎదగడానికి పావులు కదుపుతున్నాడు. ఒకప్పడు పద్మారెడ్డికి వీర విధేయులగా ఉన్న నాయకులను మచ్చిక చేసుకుంటున్నాడు. విందులు వినోదాలతో వారిని ఆకట్టుకుంటున్నాడు. మెదక్– పాపన్నపేట మండలంలోని బీఆర్‌ఎస్ నాయకులను తన దారికి తెచ్చుకున్నాడు. పాపన్నపేట మండల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాశీ, ప్రయాగయాత్రలు వెళ్లేందుకు వాహన సదుపాయం కల్పించాడు. దసరా తర్వాత అతన్ని కలవడానికి వెళ్లిన సుమారు 50 మంది బీఆర్‌ఎస్ నాయకులకు కొంపల్లిలోని ఓ రెస్టారెంట్‌లో భారీ విందు ఏర్పాటు చేశాడు. చిత్రమేమిటంటే అక్కడకు వెళ్లిన నాయకులు, 2 కి.మీ దూరంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డిని కలవకుండానే తిరిగి తమ ఇళ్లకు మళ్లారు. గతంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రిని నియోజకవర్గ నాయకులు ఎవరు కలవాలన్నా, స్థానిక ఎమ్మెల్యే ద్వారానే వెళ్లే వారు. కానీ ఎన్నికల అనంతరం పరిస్థితులు మారాయి. ఈ విషయాన్ని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లి డైరక్ట్‌గా కలిసే అవకాశాన్ని సంపాదించారు. ఇటీవల ఎర్రవల్లిలో జరిగిన మాజీ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలకు కూడా గ్రూపుల వారీగా తరలి వెళ్లినట్లు తెలుస్తుంది.
ఎవరికి వారే యమునా తీరే..
మెదక్ బీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం నలుగురి మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది. పద్మారెడ్డి, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నియోజకవర్గ నాయకత్వం కోసం పోటీ పడుతున్నారు. నియోజక వర్గంలోని కార్యకర్తల ఇళ్లలో ఎలాంటి బాధాకర సంఘటన జరిగినా, ఇద్దరు నాయకులు పోటీ పడి స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన ఆర్థిక సహాయం వారు చేస్తున్నారు. ఎవరికి వారే సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడ కార్యక్రమాలకు వెళ్లినా, అధిపత్య ప్రదర్శన కోసం స్థానిక నాయకులతో కలిసి భారీ కాన్వాయ్‌లతో సాగుతున్నారు. వీరంతా వెళ్లేది ఒకే కార్యక్రమానికి అయినా, వేర్వేరుగా వెళ్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక నాయకుడు మాత్రం తన వెంట వచ్చిన వారికి విందు ఏర్పాటు చేస్తున్నాడు. కాగా ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నప్పటికీ. ‘ఎద్దు పుండు కాకి ముద్దు అన్నట్లు’అధినాయకుల మధ్య ఏర్పడిన అగాథం.. స్థానిక నాయకులకు మాత్రం గుర్తింపుతో పాటు ఖుషీని పంచుతుంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రూపు రాజకీయాలు రచ్చకు దారి తీసే ప్రమాదం ఉందని మధ్యస్తంగా ఉన్న పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment