ఎన్నికలపై పూర్తి అవగాహన ఉండాలి
అదనపు కలెక్టర్ నగేష్
మెదక్‌జోన్: పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ విధుల పట్ల సిబ్బంది సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం కల్టెరేట్‌లోని సమావేశ మందిరంలో పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, తహసీల్దార్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని, ఆదేశించారు. ఈనెల 26న ఉదయం 9 గంటలకు జిల్లాలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని సరిచూసుకొని, ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. అధికారులందరూ సమన్వయంతో విధులు సక్రమంగా నిర్వహించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవోలు జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతులు స్వీకరించిన ఎస్పీ
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎస్పీ.. చట్ట ప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు.
మహిళా సాధికారతపై వారోత్సవాలు
నేడు మెదక్‌లో 2కే రన్
మెదక్ కలెక్టరేట్: ఆర్థిక అక్షరాస్యత, మహిళా సాధికారతపై వారోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయని, మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అదనపు కలెక్టర్ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం లీడ్ బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహిళల కోసం ఆర్థిక ప్రణాళిక, పొదుపు నష్టనివారణ చర్యలు ఆర్థిక పరిపుష్టి రుణాలు పొందడం, గృహరుణాలు, ఉద్యోగినిలకు, స్వయం ఉపాధి పొందాలనే మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
బీజేపీ అభ్యర్థుల గెలుపునకుకృషి చేయాలి
ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి
టేక్మాల్(మెదక్): త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం టేక్మాల్‌లో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లు తెలంగాణని దోచుకున్న బీఆర్‌ఎస్, ఏడాది కాలంలోనే అసమర్థ పాలనతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పట్టభద్రుల ఎన్నికల ఇన్‌చార్జి నాగరాజు, టీచర్ ఎమ్మెల్సీ ఇన్‌చార్జి సిద్ధిరాములు, కొందుర్గు, కొత్తూరు మండలాల అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, అత్తాపూర్ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహ యాదవ్, సుధాకర్ అప్ప, జిల్లా కౌన్సిల్ సభ్యులు మహేశ్, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
అరుదైన భైరవుని శిల్పం
చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర ఆలయంలో అరుదైన భైరవుడి విగ్రహం ఉందని చరిత్ర పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృంద సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారం ఆలయాన్ని మరోసారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉన్న శిల్పాల్లో భైరువుడి కుడివైపున మైరవి శిల్పం ఉండడం చాలా అరుదైనదన్నారు. చతుర్భుడైన భైరవుడు జటాఝాటంతో త్రిశూలం, ఢమరుకం, కత్తి, రక్తపాత్రలతో, కాళ్లకు, దండ రెట్టలకు కడియాలు, చెవులకు కుండలాలు, మెడలో కపాలమాలతో సర్వాంగ సుందరంగా చెక్కి ఉన్న ఈ భైరవుడు చాళుక్యుల కాలానికి చెందినవాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment