
జన జాతరకు వేళాయే..
జాతరకు ముస్తాబైన దుర్గమ్మ ఆలయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జన జాతరకు వన దుర్గమ్మ ముస్తాబైంది. మహాశిరాత్రి పురస్కరించుకొని బుధవారం ప్రారంభం కానున్న జాతరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రభుత్వం తరపున హాజరై దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేసింది. ఏర్పాట్లలో ఎక్కడా రాజీలేకుండా కలెక్టర్ రాహుల్‌రాజ్ చర్యలు చేపట్టారు. సన్నాహక సమావేశశం ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
భారీ ఏర్పాట్లు
తెలంగాణలోనే అతి పెద్దదైన ఏడుపాయల జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సింగూరు నుంచి 0.35 టీఎంసీల నీటిని మంగళవారం విడుదల చేశారు. స్నానాల కోసం షవర్ బాత్‌లు, బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. నీటి ప్రమాదాలు జరగకుండా 150 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. ప్రత్యేక వైద్య క్యాంపులను ఏర్పాటు చేశారు. తాగు నీటి కోసం 144 కుళాయిలు, 27 ట్యాంకర్లు, 476 శౌచాలయాలు ఏర్పాటు చేశారు. 598 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి జాతర వరకు ఉచిత బస్సు సౌకర్యాం కల్పించనున్నారు. జాతరలో మద్య నిషేధం కోసం మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించనున్నారు. ఆలయం ముందు షామియానాలు, క్యూలైన్లు, మంజీరా నదిలో శివుని విగ్రహం ఏర్నాటు చేశారు.
భక్తులకు ఇబ్బందులు కలగొద్దు: కలెక్టర్
జాతరలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ నగేష్, డీఎస్పీ ప్రసన్న కుమార్, ఆర్డీఓ రమాదేవితో కలసి ఏడుపాయల్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతరలో తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్యం విషయాలలో అప్రమత్తంగా ఉండాలన్నారు. నోడల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మూడు షిఫ్ట్‌లలో పారిశుద్ధ్య సిబ్బంది పనులు చేయాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, సమన్వయ పరుచుకోవాలని సూచించారు.
నేటి నుంచే ఏడుపాయల జాతర
పట్టు వస్త్రాలు సమర్పించనున్న
మంత్రి దామోదర
ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్
883 పోలీసులతో బందోబస్తు: డీఎస్పీ
జాతరలో ఎలాంటి ఇబ్బందుల కలుగకుండా 883 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు, ముగ్గురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 61 మంది ఎస్సైలు, 45 మంది ఏఎస్‌ఐలు, 96 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 301 మంది కానిస్టేబుళ్లు, 91 మంది మహిళా కానిస్టేబుళ్లు, ,252 మంది హోంగార్డులు, 14 మంది మహిళా హోంగార్డులు విధుల్లో ఉంటారని ఆయన వివరించారు.

జన జాతరకు వేళాయే..
Comments
Please login to add a commentAdd a comment