
పట్టాలెక్కని కల
చిన్నశంకరంపేట(మెదక్): ఎన్నో ఎళ్ల కల సాకరమైందన్న ఆనందం అంతలోనే ఆవిరైంది.. తమ గ్రామం నుంచి రైలు వెళ్తున్నా తమకు రైలు కూత తప్ప ప్రయాణం చేసే భాగ్యం లేదా అని గ్రామస్తులు శ్రమకోర్చి ఏళ్ల ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి రైలు కలను సాకారం చేసుకున్నారు. రెండు రైళ్లను హల్టింగ్ కూడా ఇచ్చారు. అంతా బాగానే నడుస్తుంది అనుకున్న నేపథ్యంలో కరోనాతో ఒక్కసారిగా కల తలకిందులైంది. కరోనా సమయంలో కేంద్రంలో చాలా వరకు రైల్వే స్టేషన్ మూసి వేయగా అందులో నార్సింగి మండలం శంకాపూర్ రైల్వే స్టేషన్ ఒకటి. అనంతరం మళ్లీ తెరిచి రైళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నారని అనుకున్న గ్రామస్తుల కల మళ్లీ పట్టాలెక్కలేదు.
సొంతంగా ప్లాట్ ఫారమ్,
స్టేషన్ గది నిర్మాణం
శంకాపూర్ గ్రామ శివారు మీదుగా ఉన్న సికింద్రాబాద్–నిజామాబాద్ రైల్వే మార్గంలో నిత్యం అనేక రైళ్లు నడుస్తుంటాయి. కానీ ఇక్కడ రైల్వేస్టేషన్ లేకపోవడంతో రైళ్లు ఆగేది కాదు. 2006 అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయను గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి కోరడంతో రైల్వేస్టేషన్ మంజూరైంది. మంత్రి ఆదేశంతో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు ముందుకొచ్చిన రైల్వే అధికారులు గ్రామస్తులు సొంతంగా ప్లాట్ ఫారమ్, స్టేషన్ గదిని నిర్మించుకోవాలని సూచించారు. దీంతో గ్రామస్తులు ఇంటికి ఇంత పోగుచేశారు. డబ్బులకు తోడు శ్రమదానం చేసేందుకు ముందుకొచ్చి ప్లాట్ ఫారం, స్టేషన్ గదిని కూడా నిర్మించుకున్నారు.
పక్క స్టేషన్లకు వెళ్లి ఎక్కే పరిస్థితి
నార్సింగి మండలంలోని శంకాపూర్, జప్తిశివనూర్ గ్రామాలతోపాటు చిన్నశంకరంపేట మండలంలోని ఖాజాపూర్, కుమ్మరిపల్లి, రామాయపల్లి గ్రామాల ప్రజలకు రైలు సౌకర్యంగా ఉండేది. ఖాజాపూర్ గ్రామ శివారులో ఐరెన్ స్టీల్ పరిశ్రమ ఉండడంతో ఇతర రాష్ట్రాల కార్మికులకు అనువుగా ఉండేది. దీనికి తోడు రోజు ప్రయాణికులు సికింద్రాబాద్–నిజామాబాద్ మధ్యన ప్రయాణించేవారు. రైల్వే అధికారులు రైల్వేస్టేషన్ మూతవేయడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్జాపల్లి, అక్కన్నపేట రైల్వేస్టేన్‌లకు వెళ్లి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఎంపీకి వినతి..
ఈ విషయంపై స్థానికులు రైల్వే అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం దక్కలేదు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు దృష్టికి శంకాపూర్ గ్రామస్తులు తీసుకెళ్లారు. ఇప్పటికీ రైల్వే అధికారులు స్పందించడం లేదు. రఘునందన్‌రావు చొరవ తీసుకొని రైల్వేస్టేషన్‌ను పునరుద్దరణకు కృషి చేయాలని శంకాపూర్, ఖాజాపూర్ గ్రామ ప్రజలు వినతిపత్రం అందించారు.
మూతపడిన శంకాపూర్ రైల్వేస్టేషన్
ఏళ్లుగా పున:ప్రారంభానికి నోచుకోని వైనం
శ్రమకోర్చి రైల్వేస్టేషన్
ఏర్పాటు చేసుకున్న గ్రామస్తులు
చందాలతో ప్లాట్‌ఫారం,
స్టేషన్ గది నిర్మాణం
మూణ్నాళ్ల ముచ్చటగానే రైలు కూత
2019లో ఆగిన కూత
తమ కలసాకరమైతుందన్న ఆనందంతో 2008లో అప్పటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ సర్వే సత్యనారాయణను పిలిచి పండుగ వాతావరణంలో రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి రోజుకు రెండు ప్యాసింజ్ రైళ్లను నిలిపారు. దీంతో సికింద్రాబాద్–నిజామాబాద్ మధ్య రైలు ప్రయాణం చేస్తూ గ్రామస్తుల సంబురపడ్డారు. 2019లో కరోనా ఉధృతి నేపథ్యంలో కేంద్రం కొన్ని రైల్వేస్టేషన్‌లను మూసివేసింది. శంకాపూర్ రైల్వే స్టేషన్‌ను కూడా మూసివేయగా అనంతరం అన్ని రైల్వేస్టేషన్‌ల మాదిరిగానే తిరిగి ప్రారంభిస్తారని గ్రామస్తులు భావించారు. కానీ గ్రామస్తుల ఆశల మీద నీళ్లు చల్లుతూ రైల్వే అధికారులు స్టేషన్‌ను ప్రారంభించలేదు. గతంలో హల్టీంగ్ ఉన్న కాచిగూడ–సికింద్రాబాద్, బోధన్–సికింద్రాబాద్ రెండు ప్యాసింజర్ రైళ్లను కూడా నిలపకుండా ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment