● నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ
● బరిలో 71 మంది అభ్యర్థులు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలకు ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థుల ప్రచారం జోరందుకొంది. 26న మహాశివరాత్రి పర్వదినం, 27న ఏడుపాయలలో మహాశివరాత్రి జాతర ఉండడంతో ఓటు వేసేందుకు ఓటర్లు వస్తారో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలకు సంబంధించి మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 15, పట్టభద్రుల పోటీలో 56 మంది పోటీలో ఉన్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా పోటీ పడుతున్నారు.
43 పోలింగ్ కేంద్రాలు
ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి కావచ్చింది. అలాగే జిల్లాలో 1,347 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 21 పోలింగ్ కేంద్రాలు; 12,472 మంది పట్టభద్రులు ఓటర్లు ఉండగా 22 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పరిశీలించేందుకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఇటీవల మెదక్‌కు చేరుకొని వివిధ నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు.
పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు
మెదక్ సమీకృత కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో 24న పోలింగ్ అధికారులకు పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా అదనపు కలెక్టర్ నగేశ్, మాస్టర్ ట్రైనర్ తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి శిక్షణ ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియకు వినియోగించే బ్యాలెట్ బాక్సులు, అన్ని రకాల ఫారంలతో పాటు నమూనా ఓటింగ్ ప్రక్రియను అధికారులతో సాధన చేయించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంటాయని, ఓటింగ్ గోప్యతను అమలయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా జిల్లా కేంద్రంలో ఎన్నికల అధికారులకు బుధవారం పోలింగ్ సామగ్రి అందజేయనున్నారు.
నోటాకు
నో చాన్స్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈవీఎంలు ఉండవు కాబట్టి బ్యాలెట్ పత్రాలు ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తారు. దీంతో ఈ ఎన్నికలలో నోటాకు అవకాశం లేదు. ఎన్నికల నిర్వహణకు ఆరుగురు ఫ్రయింగ్ స్క్వాడ్ సిబ్బంది, ముగ్గురు వీఎస్‌టీలు, 21 మంది ఏంసీసీలు, తొమ్మిది మంది సెక్టోరియల్ అధికారులు, 22 మంది పోలింగ్ అధికారులు, 22 మంది సహాయ అధికారులు, 44 మంది ఇతర సిబ్బంది, 22 మంది మైక్రో అబ్జర్వర్లను ఇప్పటికే నియమించారు. పోలింగ్, పోలీస్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment