
క్షయమించొద్దు
● జిల్లాలో క్షయ నివారణకు
అధికారుల చర్యలు
● విస్తృతంగా వైద్య పరీక్షలు
● కొత్తగా 62 కేసుల గుర్తింపు
మెదక్ కలెక్టరేట్: ప్రాణాంతకమైన క్షయ (టీబీ)ను సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ముమ్మరంగా క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 17 వరకు వంద రోజుల క్యాంపెయిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా గత డిసెంబర్‌లో డీఎంహెచ్‌ఓ శ్రీరామ్, టీబీ నియంత్రణ అధికారి నవీన్ కలెక్టరేట్‌లో వైద్య సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. 72 వేల మందికి పరీక్షలు జిల్లాలో ఇప్పటివరకు 72,000 మందికి క్షయ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అలాగే 4,000 మందికి ఎక్సరేలు, 3,800 మందికి తెమడ పరీక్షలు చేశారు. కొత్తగా 62 మంది వ్యాధిగ్రస్తులను గుర్తించారు. క్షయ ఊపిరితిత్తులకు వచ్చే వ్యాధి. ఇది వచ్చిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా గాలిలో కలిసి ఇతరులకు సోకుతుంది. వ్యాధి సోకిన వారు ఎప్పుడూ నీరసంగా ఉంటారు. సాయంత్రం సమయాల్లో దగ్గు తో పాటు తరచూ జ్వరం వస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే గతంలో వేల సంఖ్యలో టీబీ కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం వైద్య సిబ్బంది చేపడుతున్న విస్తృత కార్యక్రమాలతో జిల్లాలో క్షయ తగ్గుముఖం పడుతుంది.
వ్యాధి తగ్గుముఖం పట్టింది
గతంలో ఏడాదికి 1,000 నుంచి 1,500 వరకు టీబీ కేసులు వచ్చేవి. ఇప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వంద రోజుల క్యాంపెయిన్ కొనసాగుతుంది. జిల్లాలో ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలో 450 మంది వ్యాధి సోకిన వారు ఉన్నారు. వారికి అవసరమైన మందులు, న్యూట్రీషన్ కిట్లు అందిస్తూ.. నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తున్నాం.
– శ్రీరామ్, జిల్లా వైద్యాధికారి
న్యూట్రీషన్ కిట్ల పంపిణీ
జిల్లాలో ఇటీవల గుర్తించిన వారితో కలిపి మొత్తం 450 మంది క్షయ(టీబీ) వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరు ఆరు నెలల కోర్సు మందులు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఈ మందులను ప్రభుత్వం సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఉచితంగా అందజేస్తుంది. అలాగే రోగులకు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. పౌష్టికాహారం కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో నెలకు రూ.500 అకౌంట్‌లో జమచేసేది. ప్రస్తుతం రూ.1,000 జమ చేస్తుంది. జిల్లాలో ఫార్మా కంపెనీల సౌజన్యంతో వ్యాధిగ్రస్తులకు నెలనెల న్యూట్రీషన్ కిట్లు అందజేస్తున్నారు.

క్షయమించొద్దు
Comments
Please login to add a commentAdd a comment