గోరంతే ఇచ్చినారు
మెదక్‌జోన్: కూరగాయల అవసరం జిల్లాకు కొండంత ఉంటే, ప్రభుత్వం గోరంత నారు ఇచ్చి చేతులు దులుపుకుంది. కొన్నేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలను ఎత్తివేయటంతో సాగు అంతకంత తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలను అధిక ధరలకు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ధరలు చుక్కలనంటడంతో పాటు నాణ్యమైనవి దొరకటం కష్టతరంగా మారింది.
సబ్సిడీ విత్తనాలకు మంగళం
జిల్లాలో 7.24 లక్షల పైచిలుకు జనాభా ఉండగా.. ఒక్కో వ్యక్తి నిత్యం 200 గ్రాముల కూరగాయలను తన ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈలెక్కన రోజుకు 140 టన్నుల కూరగాయలు అవసరం. ఇందుకు గానూ కనీసం వెయ్యికి పైగా ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తే జిల్లా ప్రజల అవసరాలకు సరిపోతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా గతంలో కూరగాయల సాగు కోసం సబ్సిడీపై నాణ్యమైన ఆకుకూరలు, కూరగాయల విత్తనాలను రైతులకు అందించేవారు. దీంతో రైతులు విస్తృతంగా సాగు చేశారు. 2016 నుంచి సబ్సిడీ విత్తనాలకు మంగళం పాడటంతో సాగు 60 శాతానికి పడిపోయింది. అలాగే జిల్లాలో 3.95 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటే, కూరగాయలు మాత్రం కేవలం 180 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా కేంద్రం 2024 వానాకాలం, ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి కేవలం 20 హెక్టార్లకు సరిపడా కూరగాయల నారుమళ్లను మాత్రమే జిల్లాకు మంజూరు చేసింది.
ములుగు నుంచి సరఫరా
సిద్దిపేట జిల్లా ములుగులో సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా వివిధ రకాల కూరగాయల మొక్కలను పెంచి వాటిని పూర్తిగా సబ్సిడీపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుంది. ఇందులో ప్రధానంగా టమాట, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలి ఫ్లవర్.. తదితర కూరగాయల నారుమళ్లను పెంచుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో గత ఖరీఫ్‌తో పాటు ప్రస్తుత రబీ సీజన్‌లోనూ కేవలం 20 హెక్టార్లకు సరిపడా నారుమళ్లను వందశాతం సబ్సిడీపై 28 మంది రైతులకు మాత్రమే అందించారు. కాగా నారుమళ్లను పెంచేందుకు ఒక్కో హెక్టారుకు రూ.8 వేల ఖర్చు అవుతుండగా, రూ.1.60 లక్షలతో 50 ఎకరాలకు కూరగాయల నారుమళ్లను అందించారు. ఇది ఏ మూలన సరిపోదని, కనీసం వెయ్యి ఎకరాల పైబడి కూరగాయలు సాగు చేస్తేనే జిల్లా అవసరాలకు సరిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది పైలెట్ ప్రాజెక్టు మాత్రమే
సిద్దిపేట జిల్లా ములుగులో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నాణ్యమైన వివిధ రకాల కూరగాయల నారుమళ్లను పెంచి రైతులకు పూర్తిగా సబ్సిడీపై ఇస్తుంది. జిల్లాకు 20 హెక్టార్లకు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద కొనసాగుతుంది. రానున్న వార్షిక సంవత్సరానికి ఎక్కువగా మంజూరు చేసే అవకాశం ఉంది. – ప్రతాప్‌సింగ్,
జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
20 హెక్టార్లకే కూరగాయల నారు పరిమితం
Comments
Please login to add a commentAdd a comment