బండ్ల జోరు.. జాతర హోరు
పాపన్నపేట(మెదక్): జోడెడ్ల బండ్ల జోరు.. బోనాల హోరు.. శివసత్తుల శిగాలు.. పోతరాజుల గావు కేకలు.. డప్పు చప్పుళ్లు.. యువకుల నృత్యాలతో ఏడుపా యల్లోని కొండా కోన ప్రతి ధ్వనించాయి. జాతర రెండో రోజు గురువారం ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కనుల పండువగా జరిగింది. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగా.. ఆచారం ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండికి నాగ్సాన్‌పల్లి వద్ద పనిబాటల వారు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. యువకుల నృత్యాల మధ్య బండ్ల ఊరేగింపు కొనసాగింది. రాజగోపురం వద్దకు చేరుకోగానే.. ఆలయ అధికారులు ప్రతి బండి ఎదుట కొబ్బరికాయ కొట్టి దుర్గమ్మ చిత్రపటాలను బహూకరించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
గురువారం తెల్లవారుజాము నుంచే ఏడుపాయలకు భక్తులు పోటెత్తారు. మంజీర నదిలో స్నానాలు చేసి, బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. సాయంత్రం బండ్ల ఊరేగింపును తిలకించారు. జాతరలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో చాలా మంది తప్పిపోయి, తమ వారిని చేరడానికి పోలీస్ కంట్రోల్ రూంకు తరలివచ్చారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కృష్ణ, ఈఓ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
బోనంతో తరలివస్తున్న భ క్తులు
ఏడుపాయల్లో భక్తుల సందడి
Comments
Please login to add a commentAdd a comment