ఎవరి ధీమా వారిదే!
పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం
నర్సాపూర్/కౌడిపల్లి/వెల్దుర్తి(తూప్రాన్): ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగిసేవరకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు గెలిస్తేనే ఉపాధ్యాయ, పట్టభద్రుల సమస్యలు పరష్కారం అవుతాయని కాంగ్రెస్ నేతలు హామీనిస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థులు గెలిస్తేనే సమన్యాయం జరుగుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. మొత్తం మీద గురువారం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద నాయకుల సందడి సార్వత్రిక ఎన్నికలను తలపించింది. నర్సాపూర్‌లో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌తో పాటు ఆయా పార్టీల నాయకులు పోలింగ్ కేంద్రం ఎదుట ఓట్లు అభ్యర్థించారు. ఉమ్మడి వెల్దుర్తి మండలం, కౌడిపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, జిల్లా నాయకులు నరేందర్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ పరిశీలించారు. నాయకుల వద్ద ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment