అంగన్‌వాడీల బలోపేతం!
పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
తీరనున్న సిబ్బంది కొరత
మెదక్‌జోన్: అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లాస్థాయిలో నోటిఫికేషన్ జారీ కానుంది.
జిల్లావ్యాప్తంగా 392 ఖాళీలు..
జిల్లావ్యాప్తంగా 1,076 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 3 నుంచి ఆరేళ్ల వయసు గల చిన్నారులు 19,937 మంది, గర్భిణులు 5,007, బాలింతలు 4,873 మంది ఉన్నారు. కాగా జిల్లాలో 191 మినీ, 885 మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లు ఉన్నాయి. మెయిన్ సెంటర్లలో టీచర్‌తో పాటు ఆయా ఇద్దరు ఉంటారు. మినీ అంగన్‌వాడీలో కేవలం టీచర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తోంది. దీంతో పిల్లలకు ఆటపాటలతో చదువు చెప్పటం, పిల్లలతో పాటు సెంటర్ పరిధిలోని గర్భిణులు, బాలింతలకు వంటచేసి పెట్టడం ఇబ్బందిగా మారింది. ఈక్రమంలో మినీ సెంటర్లకు తల్లిదండ్రులు పిల్లలను పంపడం కూడా మానేశారు. విషయాన్ని సిబ్బంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ మినీ సెంటర్లను 2024 ఏప్రిల్‌లో మెయిన్ సెంటర్లుగా మార్చారు. దీంతో జిల్లాలో 191 మినీ సెంటర్లు మెయిన్‌గా మారాయి. అయితే అందులో ఆయాలను మాత్రం నేటికీ నియమించలేదు. జిల్లాలో పదవీ విరమణ, మరణించిన వారితో కలిపి మొత్తం 340 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటితో పాటు రిటైర్ట్ అయిన టీచర్ల స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో జిల్లావ్యాప్తంగా 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ తాజా ప్రకటనతో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్య అందనుంది.
మహిళల్లో చిగురించిన ఆశలు
అంగన్‌వాడీ కేంద్రాల్లో నియామకాలకు ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారిని అర్హులుగా నిర్ణయించినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. గతంలో ఉన్న నిబంధనలు మార్చి విద్యార్హతలో మార్పులు చేశారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి.
జిల్లాలో ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలు 1,076
టీచర్ల ఖాళీలు 52
ఆయాలు 340
Comments
Please login to add a commentAdd a comment