విద్యకు 15 శాతం కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యకు 15 శాతం కేటాయించాలి

Published Sat, Mar 1 2025 8:05 AM | Last Updated on Sat, Mar 1 2025 8:01 AM

విద్య

విద్యకు 15 శాతం కేటాయించాలి

నిజాంపేట(మెదక్‌): రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి 15శాతం నిధులు కేటాయించాలని దళిత బహుజన ఫ్రంట్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం మండలంలోని నార్లాపూర్‌ నుంచి నిజాంపేట తహసీల్దార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈసందర్భంగా డీబీఎఫ్‌ జాతీయ కార్యదర్శి శంకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. బడ్జెట్‌లో కేవలం 7 శాతం నిధులు కేటాయించిందని మండిపడ్డారు. రానున్న బడ్జెట్‌లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు బత్తుల కోటేశ్వర్‌, స్వామి, జగన్‌, మద్దికుంట నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

పరీక్షలపై దృష్టి సారించండి

చిన్నశంకరంపేట(మెదక్‌): పదో తరగతి విద్యార్థులు పరీక్షలపై ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ నగేష్‌ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. పాఠ్యంశాలను రివ్యూ చేస్తూ పదికి పది గ్రేడ్‌ సాధించాలన్నారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం భోజన ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ప్రిన్సిపాల్‌ గీతా, తహసీల్దార్‌ మన్నన్‌, ఆర్‌ఐ రాజు ఉన్నారు.

షీటీమ్స్‌తో భరోసా: ఎస్పీ

మెదక్‌ మున్సిపాలిటీ: షీటీమ్స్‌ విద్యార్థినులు, బాలికలు, మహిళలకు ఆపద సమయంలో భరోసా ఇస్తాయని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గత నెలలో షీటీం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. జిల్లావ్యాప్తంగా 9 మంది ఈవ్‌టీజర్లపై కేసు నమోదు చేశామని, మరో 44 మందిని పట్టుకొని కౌన్సెలింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్‌ 100కు కాల్‌ చేసి తక్షణ పోలీస్‌ సహాయం పొందాలన్నారు. షీటీం వాట్సాప్‌ నంబర్‌ 8712657963, పోలీస్‌ కంట్రోల్‌ రూం నంబర్‌ 8712657888 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు.

నేటి నుంచి పోలీస్‌యాక్ట్‌

మెదక్‌ మున్సిపాలిటీ: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని శనివారం నుంచి ఈనెల 31 వరకు జిల్లావ్యాప్తంగా పోలీస్‌యాక్ట్‌ అమలులో ఉంటుందని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌ అధికారుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నా, రాస్తారోకో, నిరసన, ర్యాలీ, సభలు, సమావేశాలు నిర్వహించరాదని చెప్పారు. అలాగే ప్రజాధనానికి నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు.

మదన్‌రెడ్డికి పరామర్శ

నర్సాపూర్‌: మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నాయకుడు మదన్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి శుక్రవారం పరామర్శించారు. మదన్‌రెడ్డికి ఇటీవల గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగడంతో హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యకు 15 శాతం  కేటాయించాలి 
1
1/2

విద్యకు 15 శాతం కేటాయించాలి

విద్యకు 15 శాతం  కేటాయించాలి 
2
2/2

విద్యకు 15 శాతం కేటాయించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement