రథోత్సవం.. రమణీయం
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల జాతర చివరి రోజైన శుక్రవారం వనదుర్గమ్మ రథంపై ఊరేగారు. ఆచారం ప్రకారం దేవాలయ అధికారులు నాగ్సాన్‌పల్లిలోని సాయిరెడ్డి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి ఉత్సవానికి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన 18 కులాలు, పనిబాటల వారు రథం ముందు పట్టు పరిచి, ముగ్గులు వేసి, మంత్రాలు చదివి, గుమ్మడి కాయ బలి ఇచ్చారు. అనంతరం వేద బ్రాహ్మణులు పూజలు చేశారు. ఆచారం ప్రకారం హక్కు బాపతుల వారిని, పూలమాలలు, శాలువాతో సన్మానించారు. అనంతరం ఆలయం నుంచి పల్లకిపై దుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి రథంపై ఉంచారు. దుర్గమ్మకు జై అంటు తాళ్లతో రథాన్ని లాగుతూ ఊరేగింపు ప్రారంభించారు. ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ రమాదేవి, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆలయ ఈఓ చంద్రశేఖర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ధూంధాంగా బోనాలు
జాతర చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. జోగిని శ్యామల శుక్రవారం తెల్లవారుజామున బోనం తీసి భక్తులను ఉర్రూతలూగించారు. పోతరాజులు చెర్న కోలలు చేతబట్టి బోనం ఎత్తి చిందులు వేశారు. జాతరలో ప్రధానంగా భక్తులు నీటి సమస్యను ఎదుర్కొన్నారు. ధర్మ సత్రాలలో నీరు లేక నానా ఇబ్బందులు పడ్డారు. సంబంధిత అధికారులు, ఆలయ సిబ్బంది పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సాయంత్రం మాజీ ఎమ్మెల్యే పద్మారెడ్డి, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలాగౌడ్ తదితరులు దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఏడుపాయల్లో జన సందోహం
బోనాలు, నృత్యాలతో మురిపెం
Comments
Please login to add a commentAdd a comment