
దుర్గమ్మా.. వెళ్లొస్తాం
ముగిసిన ఏడుపాయల జాతర
జాతర ఆదాయం రూ. 61.50 లక్షలు
ఏడుపాయల జాతర హుండీ ఆదాయం రూ. 61,50,237 వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం గోకుల్ షెడ్‌లో హుండీ లెక్కింపు చేపట్టారు. నగదుతో పాటు మిశ్రమ బంగారు వెండి కానుకలు వచ్చినట్లు వివరించారు. గతేడాది జాతరకు రూ. 61,18,186 ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే రూ. 32,051 అధికంగా వచ్చినట్లు తెలిపారు. కాగా గతేడాది 14 రోజుల అనంతరం హుండీ లెక్కించగా, ఈసారి 16 రోజుల అనంతరం లెక్కించారు. కార్యక్రమంలో రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు, చీఫ్ ఫెస్టివెల్ అధికారి కృష్ణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
పాపన్నపేట(మెదక్): మూడు రోజులుగా కొనసాగిన ఏడుపాయల జాతర శనివారం ముగిసింది. దుర్గమ్మా.. వెళ్లొస్తాం.. అంటూ భక్తులు తమ ఇళ్లకు మళ్లారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రారంభమైన ఏడుపాయల జాతరకు ఈ ఏడాది భక్తులు తక్కువగా వచ్చారు. కుంభమేళా ప్రభావం కొంతమేర కనిపించింది. కలెక్టర్ ఆధ్వర్యంలో రెండుసార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తాగు నీటి కోసం భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నీరు లేక కొన్ని చోట్ల టాయిలెట్లు సైతం మూతబడ్డాయి. వివిధ శాఖల అధికారులకు ఏర్పాటు చేసిన షెడ్లలో తాగు నీటి సమస్యలు తప్పలేదు. రోజుకు కేవలం 120 లీటర్ల నీరు ఇచ్చి సరిపెట్టు కొమ్మన్నారని వైద్యారోగ్య శాఖ సిబ్బంది వాపోయారు. జాతర లో సిగ్నల్స్ పనిచేయకపోవడంతో పలువురు భక్తులు తప్పిపోయారు. చేతిలో సెల్‌ఫోన్‌లు ఉన్నా, తప్పిపోయిన వారు ఎక్కడ ఉన్నారో తెలియక పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఏడుపాయల జాతరకు వచ్చిన గంగాపూర్‌కు చెందిన యువకుడు శివరాత్రి రోజు ఘనపురం ఆనకట్టలో శవమై తేలాడు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మంజీరా పాయల్లో మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చారు. పోలీస్ అధికారులు ట్రాఫిక్ సమస్య అరికట్టగలిగారు. అయితే ఏడుపాయల పాలక వర్గం లేని లోటు స్పష్టంగా కనిపించింది.
జాతర నుంచి ఇంటి దారి పడుతున్న భక్తులు

దుర్గమ్మా.. వెళ్లొస్తాం
Comments
Please login to add a commentAdd a comment