ఆశావహులకు తప్పని ఎదురుచూపులు
మెదక్‌జోన్: మెదక్ మార్కెట్ కమిటీ పదవీ కాలం 2023 సెప్టెంబర్ 13న ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం బీసీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం సీనియర్ నేత ముత్యంగౌడ్, గూడూరి ఆంజనేయులు, జీవన్‌రావు, శంకర్‌గౌడ్, మంగ మోహన్‌గౌడ్, జీవన్‌రావు, బట్టి సులోచన పోటీ పడుతున్నారు. అయితే వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. రామాయంపేట మార్కెట్ కమిటీ చెర్మన్ పదవి ముగిసి రెండేళ్లు గడిచిపోయింది. ఇది ఎస్టీకి రిజర్వు కావటంతో నలుగురు గిరిజన నేతలు పోటీ పడుతున్నారు.
చిన్నశంకరంపేట మండలం కామారం తండాకు చెందిన మోహన్‌నాయక్, ఇదే మండలం టీ మాందాపూర్ తండాకు చెందిన సురేందర్ నాయక్, అశోక్‌నాయక్‌తో పాటు నార్సింగి మండలంలోని ఓ తండాకు చెందిన రాజాసింగ్, నిజాంపేట మండలానికి చెందిన మరో ఇద్దరు పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ పోటీదారులు ఎక్కువ కావటంతో డ్రా పద్దతిన చైర్మన్‌ను ఎన్నుకుంటామని కీలక నేత ఒకరు తెలిపారు. పాపన్నపేట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2024 జనవరి 12వ తేదీతో ముగిసింది. ప్రస్తుతం ఇది ఎస్సీకి రిజర్వుడ్ కావటంతో చైర్మన్ పదవి కోసం వినోద, అమృతరావు, మధు, శ్రీనివాస్, అల్లారం రత్నయ్య, క్రీస్తుదాసు, సూర్య పోటీ పడుతున్నారు. చేగుంట మార్కెట్ కమిటీ పాలకవర్గం 2022 మే 27వ తేదీతో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని నియమించలేదు.
ఇది ఓసీకి రిజర్వుడ్ కావడంతో చైర్మన్ పదవి కోసం చేగుంట కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, వెంగళరావు, భాస్కర్ పోటీ పడుతున్నారు. నర్సాపూర్ మార్కెట్ కమిటీ 2022 సెప్టెంబర్ 25తో ముగిసింది. అప్పటి నుంచి పాలకమండలిని ఎన్నుకోలేదు. ఇది బీసీకి రిజర్వుడ్ కావటంతో నర్సాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశ్, శివ్వంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్ పోటీ పడుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మార్కెట్ కమిటీని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్‌కు రిజర్వుడు అయింది. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్‌రెడ్డి, కాళ్లకల్‌కు చెందిన మరో సీనియర్ నేత మల్లారెడ్డి పోటీ పడుతున్నారు.
మార్కెట్ పాలకవర్గాలను ఏర్పాటుచేయకపోవడంతో రైతులు పండించిన ఉత్పత్తులను కొనుగోలు చేసే వారు కరువయ్యారు. రామాయంపేట మార్కెట్ కమిటీ పరిధిలో వరి తర్వాత మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు. పాలకమండలి లేకపోవటంతో పంటను కొనుగోలు చేసేవారు ఎవరూ లేరు. దీంతో అన్నదాతలు తక్కువ ధరకు బయటి వ్యాపారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే మెదక్ మార్కెట్ కమిటీ జిల్లా కేంద్రంలో ఉండటంతో ఇతర మండలాల నుంచి రైతులు మొక్కలు, కందులు, పొద్దుతిరుగుడు లాంటి ఉత్పత్తులు తీసుకొస్తారు. పాలకవర్గం లేకపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిల్లాలోని మిగితా మార్కెట్లలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment