పక్కాగా పంటల నమోదు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో పంటల నమోదు పక్కాగా జరుగుతోంది. ప్రతి రైతుకు ప్రయో జనం అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి జిల్లా లో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సర్వే నంబర్ల ఆధారంగా సాగు వివరాలు, పంటల ఫొటోలు యాప్‌లో పొందుపరుస్తున్నారు.
ఒక్కో అధికారికి 2 వేల ఎకరాలు
జిల్లాలో మొత్తం 21 మండలాలు, 493 గ్రామా లు ఉండగా.. వీటిని వ్యవసాయ అధికారులు 76 క్లస్టర్లుగా విభజించి డిజిటల్ సర్వే ప్రారంభించారు. ఇందులో మొత్తం 1,49,593 ఎకరాల్లో సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ముమ్మరంగా సర్వే కొనసాగిస్తున్నారు. జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఒక్కొక్కరికి 2 వేల ఎకరాలు సర్వే చేయాలని ఆదేశించారు. అయితే మహిళా అధికారులకు మాత్రం 1,800 ఎకరాల టార్గెట్ ఇచ్చారు. ఎవరైనా పంట వేయకుంటే నో క్రాప్ అని నమోదు చేస్తున్నారు. అయితే వ్యవసాయ క్షేత్రాల్లోకి వెళ్లినప్పుడు కొన్ని గ్రామాల శివారులో సిగ్నల్స్ సమస్య తలెత్తుతోంది. దీంతో డిజిటల్ సర్వే ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు 63,890 ఎకరాల్లో 40 శాతం సర్వే పూర్తయింది. ఇంకా జిల్లాలో 85,703 ఎకరాల విస్తీర్ణంలో పంటల నమోదు చేయాల్సి ఉంది. సిగ్నల్స్ సమస్యతో సర్వే జాప్యం అవుతున్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
రైతులకు ప్రయోజనాలు
జిల్లాలో జరుగుతున్న పంటల సాగు డిజిటల్ సర్వేతో రైతులకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. సర్వే ఆధారంగా ఎక్కడ, ఏ రైతులు ఏ పంట వేస్తున్నారనే విషయం ప్రభుత్వానికి తెలుస్తుంది. రైతులు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ప్రభు త్వం మార్కెట్ సౌకర్యం కల్పి స్తుంది. అలాగే రైతులు ప్రకృతి విపత్తుల నుంచి నష్టపోకుండా పంటల బీమా వసతి కల్పించనుంది. పంట నష్టం అంచనా పక్కాగా ఉంటుంది.
కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ సర్వే
20 రోజుల్లో పూర్తి చేస్తాం
జిల్లాలో డిజిటల్ క్రాప్ సర్వే 40 శాతం పూర్తయింది. మిగితాది మరో 15, 20 రోజుల్లో పూర్తి చేస్తాం. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ సర్వే ద్వారా రైతులకు సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనొత్పత్తి , రైతుబీమా, భరోసా వంటి పథకాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. సర్వే త్వరగా పూర్తయ్యేందుకు రైతులు అధికారులకు సహకరించాలి.
– వినయ్‌కుమార్,
ఇన్‌చార్జి జిల్లా వ్యవసాయ అధికారి
పక్కాగా పంటల నమోదు
Comments
Please login to add a commentAdd a comment