
ఇంటర్ పరీక్షలకు వేళాయే
నేటి నుంచి ప్రారంభం
● ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
● జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు
● ప్రతీ కేంద్రంలో సీసీ కెమెరాలు
● క్యూ ఆర్ కోడ్‌తో సెంటర్ల గుర్తింపు
● మొత్తం 12,484 విద్యార్థులు
పాపన్నపేట(మెదక్): జిల్లాలో ఇంటర్ మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ నిబంధన సడలించారు. 5 నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ నున్నారు. జిల్లాలో 30 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ,12,484 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరంలో 6,066 మంది, ద్వితీయ సంవత్సరంలో 6,418 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్ష కేంద్రంలో అమర్చిన సీసీ కెమెరాలతో ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్‌గా వీక్షించనున్నారు. హాల్‌టికెట్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్ ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్ తెలుసుకోవచ్చు.
భారీగా సిబ్బంది
పరీక్షల నిర్వాహణ కోసం హైపర్ కమిటీ సభ్యులు, కన్వీనర్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఒక్కొక్కరు, నలుగురు సిట్టింగ్ స్క్వాడ్‌లు, చీఫ్ సూపరింటెండెంట్‌లు 30, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌లు 30 మంది, 520 మంది ఇన్విజిలేటర్లను నియామకం చేశారు. ఒక్కో కేంద్రంలో 5 సీసీ కెమెరాలు బిగించారు. వీటి ద్వారా ఇంటర్ బోర్డు అధికారులు డైరెక్ట్‌గా సెంటర్‌లోని పరిస్థితులు వీక్షించవచ్చు. ఉదయం 9 గంల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ రాని వారు నేరుగా టీజీబీఐ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్న పత్రంపై సీరియల్ నంబర్ ముద్రిస్తున్నారు. ప్రశ్నాపత్రం బయటకు వెళ్తే ఎవరి పేపరో తెలుస్తుంది.
ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు
నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రతీ కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు ఎవరైనా ఒత్తిడికి, మానసిక ఆందోళనకు గురైతే వెంటనే 14418 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. విద్యార్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకెళ్లొద్దు. వాచ్‌లు కూడా తీసుకురావద్దు. విద్యార్థులకు సమయం తెలిసేలా అర గంటకోసారి బెల్ మోగిస్తారు. పరీక్షలు కట్టు దిట్టంగా నిర్వహించేందుకు పూర్తి చర్యలు తీసుకున్నాం. – జి.మాధవి, డీఐఈఓ
Comments
Please login to add a commentAdd a comment