
‘అష్ట’కష్టాలు
మెదక్‌జోన్: మెతుకు సీమకు మంజూరైన వైద్య కళాశాలకు ‘అష్ట’కష్టాలు చుట్టుముట్టాయి. ఈ కళాశాల భవననిర్మాణానికి ఎనిమిది నెలల క్రితమే నిధులు మంజూరైనా నిర్మించేందుకు ఇంకా స్థల సేకరణ మాత్రం పూర్తికాలేదు. ఈ వైద్య కళాశాల భవన నిర్మాణానికి 20 ఎకరాలు గుర్తించాల్సి ఉండగా ఇప్పటివకు 12 ఎకరాలు మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. ఇంకా ఎనిమిదెకరాల స్థలాన్ని గుర్తించాల్సి ఉంది. దీంతో ఓ ప్రైవేటు అద్దె భవనంలోనే అరకొర వసతులతో వైద్య కళాశాలను కొనసాగిస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గతేడాది ఆగస్టులో నిధులు మంజూరు
గతేడాది ఆగస్టులో వైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు హాస్టల్ భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లను మంజూరు చేసింది. దీంతో తాత్కాలికంగా ఓ ప్రైవేటు అద్దెభవనంలో కళాశాలను నిర్వహిస్తున్నారు. అయితే వైద్య కళాశాల, హాస్టల్ భవనాలకు 20 ఎకరాల స్థలం అవసరం కాగా ప్రస్తుతం పిల్లికొటాల్ శివారులోని మాతాశిశు(ఎంసీహెచ్) ఆస్పత్రి సమీపంలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించారు. ఇందుకోసం మరో 8 ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సింది ఉంది.
టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగింత
మెడికల్ కళాశాల భవన నిర్మాణానికి రూ.130కోట్లు, హాస్టల్ భవనానికి రూ.50కోట్లతో కలిపి మొత్తం రూ.180కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ భవన నిర్మాణ పనులను ముందుగా ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించిన ఉన్నతాధికారులు మళ్లీ దానిని రద్దు చేస్తూ తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఈడబ్ల్యూడీసీ)కి అప్పగించారు.
మంత్రి ఆదేశిస్తే తప్పా...
మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు ఈ నెల 3న స్థలాన్ని పరిశీలించారు. సరిపడా ల్యాండ్‌ను గుర్తించి టీజీఈడబ్ల్యూడీసీకి అప్పగిస్తే దాన్ని లేఅవుట్ చేశాక టెండర్ పిలుస్తారు. అనంతరం పనులు మొదలు పెడతారు. అయితే అధికారుల నిర్లిప్తత కారణంగా ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
వైద్య కళాశాల భవన నిర్మాణానికి అప్పగించని భూమి
20 ఎకరాలకుగానూ గుర్తించింది 12 ఎకరాలే
ఇంకా కావాల్సింది ఎనిమిదెకరాలు
8 నెలల క్రితమే నిధులు మంజూరు
కాలేజీ, హాస్టల్ భవన నిర్మాణాలకు రూ.180కోట్లు
అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే మెడికల్ కాలేజీ కొనసాగింపు
వారంలో అప్పగిస్తామన్నారు
వైద్య కళాశాల భవనంతో పాటు హాస్టల్ భవన నిర్మాణంకోసం 20 ఎకరాల స్థలం అవసరం ఉంది. పిల్లికొటాల్ శివారులోని ఎంసీహెచ్ ఆస్పత్రి సమీపంలో వైద్యారోగ్య ఉన్నతాధికారులు 12 ఎకరాలను మాకు అప్పగించారు. మరో 8 ఎకరాల భూమి కావాలి. వారం రోజుల్లో అప్పగిస్తాం అని చెబుతున్నారు. స్థలం అప్పగించాక టెండర్ పిలవాల్సి ఉంటుంది.
–చారీ, డీఈ, టీజీఈడబ్ల్యూడీసీ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment