చిరుత.. భయం భయం
రైతులు జాగ్రత్తగా ఉండాలి
చిరుత దాడుల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలి. తమ పశువులను సాధ్యమైనంత వరకు అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంచొద్దు. ఇళ్ల వద్దకు తీసుకెళ్లాలి. అలాగే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు. కనీసం నలుగురు రైతులు కర్రలు పట్టుకొని వెళ్లాలి. ఎక్కడైనా చిరుత ఆనవాళ్లు ఉంటే వెంటనే తమకు సమాచారం అందజేయాలి.
– విద్యాసాగర్,
రామాయంపేట రేంజ్ అధికారి
రామాయంపేట(మెదక్): చిరుతల భారీ నుంచి పశువులను రక్షించుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇటీవల అటవీ ప్రాంతానికి దగ్గరగా, గిరిజన తండాల్లో ఉన్న పశువులపై చిరుతల దాడులు పెరిగాయి. గత నాలుగైదేళ్లుగా వందలాది పశువులను హతమార్చాయి. రేంజీ పరిధిలోని రామాయంపేట మండలం అక్కన్నపేట, తొనిగండ్ల, కాట్రియాల, పర్వతాపూర్, దంతేపల్లి శివారులో దట్టమైన అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు ఆరు చిరుతలు ఉన్నట్లు సమాచారం. ఈవిషయాన్ని ఆశాఖ అధికారులు తెలపకపోయినా, రెండేళ్ల క్రితం చేపట్టిన వన్యప్రాణుల గణనలో ఈ విషయం తేలింది. చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, రేసు కుక్కలు, జింకలు, నీల్‌గాయిలు ఇతర జంతువులు మనుగడ కొనసాగిస్తున్నాయి.
నీటి కోసం పంట చేల వద్దకు..
వేసవిలో అటవీప్రాంతంలో తాగునీరు, అహారం లభించకపోవడంతో చిరుతలతో పాటు ఇతర జంతువులు గ్రామాలు, తండాల్లోకి వస్తున్నాయి. వన్యప్రాణులకు తాగు నీటి కోసం అటవీప్రాంతంలో సాసర్‌పిట్లతో పాటు చిన్న చిన్న కుంటలు, చెక్‌డ్యాంలు నిర్మించారు. వాటిలో నీరు నింపకపోవడంతో అవి గ్రామాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇటీవల నార్సింగి సమీపంలోని అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న చిరుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అయితే ఈసారి కూడా నిధులు మంజూరు కాకపోవడంతో అధికారులు అటవీప్రాంతంలో వన్యప్రాణులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీనికి తోడు అడవిలో భూగర్భజలాలు ఇంకిపోయి తాగు నీరు లభించడం కష్టతరంగా మారింది. అయితే వేసవి వస్తుందంటే చాలు రైతులు భయందోళన చెందుతున్నారు. చిరుతను బంధించడానికి రామాయంపేట పట్టణ శివారులో సర్వయ్యకుంట వద్ద ఆశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. రైతులు తమ పశుసంపదను రక్షించుకోవడానికి పశువుల పాకల చుట్టూ ఇనున జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకునే వ్యవసాయం చేసుకుంటున్న రైతులు ముందస్తుగా వీటిని ఏర్పాటుచేసుకొని తమ పశువులను అందులో ఉంచుతున్నారు. మరికొందరు రైతులు ముందు జాగ్రత్త చర్యగా తమ పశువులను రాత్రివేళ పంట చేల వద్ద ఉంచకుండా ఇళ్ల వద్దకు తీసుకెళ్తున్నారు.
పశువుల రక్షణకు రైతుల తంటాలు పాకల చుట్టూ ఇనుప కంచెల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment