అందుబాటులోని ఉండని వైద్యులు
● అత్యవసర పరిస్థితుల్లోహైదరాబాద్‌కు రెఫర్ ● నానా అవస్థలు పడుతున్న రోగులు ● పట్టించుకోని అధికారులు
మెదక్‌జోన్: పేద, మధ్య తరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదటగా ప్రభుత్వ ధర్మాస్పత్రి వైపే చూ స్తారు. ఇక్కడ ఉచితంగా వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు ఉంటారనే నమ్మకంతో వస్తుంటారు. కానీ ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవడం పేదలకు శాపంగా మారుతోంది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావటంతో స్పెషలిస్టులతో పాటు వైద్య సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రస్తుతం సుమారు 35 నుంచి 40 మంది వైద్యులు ఉన్నారు. వీరంతా ఉదయం 11 గంటల వరకు ఆస్పత్రికి రావడం లేదు. మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిందంటే ఉండడం లేదని పలువురు రోగులు చెబుతున్నారు. అర్థరాత్రి రోడ్డు ప్రమాదాలు జరిగి గాయపడినా.. అత్యవసర వైద్యంతో ఆస్పత్రికి వచ్చినా.. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇంత పెద్దసంఖ్యలో ఉన్న వైద్యులు నిత్యం హైదరాబాద్ నుంచి రోజూ విధులకు హాజరవుతున్నారు. స్థానికంగా ఎవరూ ఉండటం లేదు. ఫలితంగా రోగులకు సరైన వైద్యం అందడం లేదు.
వైద్య పరీక్షలకు బయటకే..
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కనీసం సిటీ స్కాన్ అందుబాటులో లేదు. ఎంఆర్‌ఐ, గుండెకు సంబంధించిన పరీక్షలు కావాలన్నా సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. ఎక్స్‌రే తీస్తే ఫిలిం ఉండడం లేదు. అంతేకాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉండాల్సిన జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్లు సరిగా విధులు నిర్వర్తించడం లేదు. కొంతకాలంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ లేకపోవటం.. ఇన్‌చార్జిగా కొనసాగుతున్న అధికారి చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విష యాన్ని పలుమార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న నాథుడే కరువయ్యారని జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment