రాజుల కోటలో రత్నాల వేట
గుప్త నిధుల తవ్వకాలతో..
● ఆనవాళ్లు కోల్పోతున్న రంగంపేట కోట
● పట్టించుకోని ప్రభుత్వాలు
● పరిరక్షించాలంటున్న ప్రజలు
కొల్చారం(నర్సాపూర్): రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ ఆనాటి చరిత్రను తెలిపే కోటలు మాత్రం ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో వందల ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం కలిగిన రంగంపేట కోట ఒకటి. హైదరాబాద్ రాజ్యంలో ఉన్న 14 సంస్థానాల్లో ఒకటైన పాపన్నపేట సంస్థానం కింద నిజాం నవాబులచే రాయ్‌భాగన్ (ఆడ సింహం)గా బిరుదు పొందిన రాణి శంకరమ్మ దత్తపుత్రుడైన రాజా సదాశివరెడ్డి 1,700 సంవత్సర మధ్యకాలంలో ఈ కోటను నిర్మించారు. నిజాం పరిపాలనలో ఈ కోట ఆర్థిక భాండాగారంగా కొనసాగిందని చరిత్ర చెబుతుంది. అయితే ప్రస్తుతం ఆ కోట గుప్తనిధుల వేటగాళ్ల ధ్వంస రచనతో బీటలు వారింది. శిథిలావస్థకు చేరి అధ్వానంగా మారింది. ఎంతో చరిత్ర కలిగిన రంగంపేట కోట గురించి భావితరాలు తెలుసుకునేలా పురావస్తు శాఖ రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడే నిర్మాణానికి నాంది
పాపన్నపేట సంస్థానం, ఆందోల్ సంస్థానాల మధ్య రాణి శంకరమ్మ పరిపాలన సాగిస్తూ తిరుగులేని రాణిగా కొనసాగింది. వృద్ధాప్యం వచ్చే క్రమంలో రాజ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో బాలుడైన రాజా సదాశివరెడ్డిని దత్తత తీసుకొని రాజుగా ప్రకటించింది. ఆయన ఆందోల్ నుంచి రంగంపేట మీదుగా ఎడ్ల బండిలో పాపన్నపేటకు మంది మార్బలంతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కోట నిర్మించిన రంగంపేట శివారులోకి రాగానే వేట కుక్కలను తరుముతున్న కుందేలు కనిపించింది. ఈ విషయమై రాజ పురోహితులతో చర్చించారని, ఇక్కడి స్థల ప్రాముఖ్యతను గుర్తించి కోట నిర్మాణానికి నాంది పలికారన్నది చరిత్ర చెబుతోంది. దాదాపు పదెకరాల విస్తీర్ణంలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించారు. చుట్టూ నాలుగు బురుజులు.. రెండు ప్రధా న ద్వారాలతో నిర్మాణమైన కోటలో రాణిమహల్, తాగునీటి అవసరాలకు మెట్లబావి, గుర్రపు శాల, అంతర్గత డ్రైనేజీ నిర్మాణం, అద్దాలమేడ, గోడలపై నకశిల్పాలు ఇలా.. ఎన్నెన్నో కోటలో కనిపిస్తాయి. కోట బురుజుపై నుంచి చూస్తే మెదక్ ఖిల్లా కనిపించడం విశేషం. కోటలో నుంచి పాపన్నపేట కోట వరకు రహస్య గుహ ఉందని, దానికి నిదర్శనంగా లోపల నిర్మాణం కనిపించడం మరో విశేషం. అద్భుతమైన శైలిలో అనంతపద్మనాభుని మాదిరిగా దర్శనమిచ్చే రంగనాయక స్వామి విగ్రహంతో దర్శనమిచ్చే దేవాలయం, లింగ దారుడైన సంగమేశ్వర స్వామి దేవాలయం సైతం అప్పుడే నిర్మించబడ్డాయి. అయితే కోటను కొంతైనా రక్షించాలన్న లక్ష్యంతో అధికారులు కోట చుట్టూ ఫెన్సింగ్, పల్లె ప్రకృతి వనం నిర్మించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
రాజుల కోటలో రత్నాల వేట
రాజుల కోటలో రత్నాల వేట
Comments
Please login to add a commentAdd a comment