జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు
నర్సాపూర్ రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ప్రతి పైసా రికవరీ చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం నర్సాపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉపాధి పనులకు సంబంధించి ప్రజావేదిక నిర్వహించారు. అటవీశాఖలో ఉపాధి హామీ పథకం ద్వారా కలిగిన మొక్కల పెంపకంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మొక్కల పెంపకానికి బినామీ పేర్లతో నీటి ట్యాంకర్లు పెట్టినట్లు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. రూ. 8,91,610 చెల్లింపులు జరిగాయన్నారు. ఇట్టి డబ్బులను రికవరీ చేస్తామని చెప్పారు. అటవీశాఖ అధికారులు ప్రజాదర్బార్‌కు రాకుండా నిర్లక్ష్యం చేసినందుకు వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మండలంలోని అహ్మద్‌నగర్, బ్రాహ్మణపల్లి, తిరుమలాపూర్, తుజాల్‌పూర్ తదితర గ్రామాల్లో అవకతవకలు జరిగినట్లు తెలిందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి రూ. 60,610 రికవరీ చేస్తామని వివరించారు. వారం రోజులుగా మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు రూ. 9.18 లక్షల నిధులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, ఏపీఓ వైద్య శ్రీనివాస్, ఏపీడీ బాలయ్య, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారిణి అరుణ, ఏపీఓ అంజిరెడ్డి, సోషల్ ఆడిట్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.