ప్రగతిలో నర్సాపూర్
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
సకాలంలో సీఎంఆర్
అందించాలి
మెదక్‌జోన్: బ్యాంకు గ్యారంటీలతో పాటు సీఎంఆర్ బియ్యాన్ని గడువులోగా పూర్తి చేసి అందించాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం రైస్‌మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024– 25 సంవత్సరానికి సంబంధించి వానాకాలం, యాసంగి ధాన్యం మరాడించేందుకు మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బ్యాంకు గ్యారంటీలు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. జిల్లాలో 94 రైస్ మిల్లులు గడువులోగా సీఎంఆర్ అందించాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సురేష్‌రెడ్డి, సివిల్ సప్లై డీఎం జగదీష్, ఎల్‌ఎండీ నరసింహామూర్తి, బ్యాంకర్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
పోడు హక్కు పత్రాలు ఇవ్వాలి
మెదక్ కలెక్టరేట్: పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అలాగే భూదాన రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మల్లేశం మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో భూ సమస్యలే అధికంగా వస్తున్నాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే నెల 7న కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహిళా కన్వీనర్ నాగమణి, నాయకులు నరేందర్, ఐలయ్య, రామస్వామి, వెంకటి తదితరులు పాల్గొన్నారు.
రుణమాఫీ వర్తించని
వారికి న్యాయం చేస్తాం
రామాయంపేట(మెదక్): రుణమాఫీ జరగని రైతులకు న్యాయం చేస్తామని జిల్లా సహకార అధికారి కరుణాకర్ హామీ ఇచ్చారు. రుణమాఫీలో తమకు అన్యాయం జరిగిందని గ్రామానికి చెందిన కొందరు రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఆయన మండలంలోని కోనాపూర్ సంఘం కార్యాలయంలో సోమవారం విచారణ చేపట్టారు. ఈసందర్భంగా డైరెక్టర్లు సీఈఓపై ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో కొందరు డైరెక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సహకార సంఘం సీఈఓ విధులు సక్రమంగా నిర్వర్తించాలని కరుణాకర్ ఆదేశించారు.
సామాజిక తనిఖీ
సాక్షిగా తప్పులు
పాపన్నపేట(మెదక్): తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు.. అన్నట్లుంది 14వ సామాజిక తనిఖీ అధికారుల వ్యవహారం. ఉపాధి హామీ పథకం కింద ఏడాది పొడవునా జరిగిన పనులకు సంబంధించి ఏటా సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఈ క్రమంలో తనిఖీకి అయిన ఖర్చులను ఫ్లెక్సీపై ముద్రించి వేదికపై ప్రదర్శిస్తారు. అయితే సోమవారం పాపన్నపేటలో ప్రదర్శించిన లెక్కల కూడికల్లో తప్పులు ఉండటాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకున్నారు. సామాజిక తనిఖీలో పాల్గొన్న తనిఖీ బృందం భోజనానికి రూ. 78,235, రవాణా ఖర్చులు రూ. 9,300, వీఆర్పీల గౌరవ వేతనాలు రూ. 49,050, స్టేషనరీ రూ. 2,950, ప్రజావేదిక వీడియో కవరేజి రూ. 6,500, బీఆర్పీల రవాణా ఖర్చులు రూ.1,845, డీఆర్డీఓ కాపీ రూ. 100, వీఆర్పీల ఎంపిక రవాణా ఖర్చులు రూ. 900 ఇవన్నీ కలిపి వాస్తవంగా రూ. 1,48,880 కావాలి, కాని అధికారులు ముద్రించిన ఫ్లెక్సీలో రూ. 14,880 ముద్రించారు. తమ ఖర్చును తామే తప్పుగా చూపిన అధికారులు ఇక ఫీల్డ్ అసిస్టెంట్‌లు, టీఏలు, ఇతర ఉద్యోగులు చేసిన తప్పులను ఎలా గుర్తిస్తారని పలువురు చర్చించుకున్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలో నర్సాపూర్ మున్సిపాలిటీ అస్తవ్యస్తంగా తయారైంది. ఆయా విభాగాల్లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా నెలకొంది. పారిశుద్ధ్యం పడకేసింది. మురికి కాలువల నిర్వహణ ప్రహసనంగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ నినాదంగానే మిగిలిపోయింది. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోగా.. ప్రజలు ఇబ్బందులతో సతమతం అవుతున్నారు.
– నర్సాపూర్
చెత్త సేకరణ అస్తవ్యస్తం
పట్టణంలో రోజూ సుమారు పది మెట్రిక్ టన్నుల చెత్తను సిబ్బంది సేకరిస్తున్నారు. ఇందుకోసం 8 ఆటోలు, రెండు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. కాగా తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ప్రజలకు సూచిస్తున్నారు. కానీ ఆచరలో అమలు కావడం లేదు. డంప్‌యార్డులో సుమారు రూ. 33 లక్షలతో డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ నిర్మించి సుమారు ఏడాది కావొస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. కాగా సిబ్బంది పట్టణంలో సేకరించిన చెత్తను డంప్‌యార్డు ఆవరణలో వేసి నిప్పు పెడుతున్నారు. అంతేగాక పట్టణం నుంచి హైదరాబాద్ మార్గంలో జాతీయ రహదారి పక్కన, మెదక్ మార్గంలోని దేవాలయ భూములు, రాయరావు చెరువు పక్కన చెత్తను వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో వాహనదారులు ఇబ్బందుల పాలవుతున్నారు.
చెరువు, కుంటలు మురికిమయం
పట్టణంలో మురికి కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో పలు కాలనీల మురికి నీరు చెరువు, కుంటలోకి చేరి మురికిమయం అవుతున్నాయి. పట్టణంలోని పలు పాత, కొత్త కాలనీలలో మురికి కాలువలు నిర్మించకపోవడం గమనార్హం.
ఎన్జీఓస్ కాలనీ కింది ఏరియాలోని సుమారు 150 ఇండ్ల నుంచి మురికి నీరు రాయరావు చెరువులోకి వెల్లడంతో చెరువు కలుషితమవుతుంది. కాగా కుమ్మరికుంటలోకి శ్రీరాంనగర్ కాలనీలోని చాలా ఏరియాలోని ఇండ్ల మురికి నీటితో పాటు 11వ వార్డులోని కొంత ఏరియాలోని ఇండ్ల నుంచి వచ్చే మురికి నీరు కోమటి కుంటలోకి వెళ్లి కలువడంతో కుంట కలుషితమవుతోంది.
శ్మశానవాటిక అధ్వానం
పట్టణంలో పలు చోట్ల శ్మశాన వాటికలు ఉ న్నాయి. వాటిలో కనీసం నీటి సదుపాయం కల్పించకపోవడంతో అంత్యక్రియల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎవరైనా చనిపోతే ట్యాంకర్ల ద్వారా నీటి సదుపాయం కల్పిస్తున్నారు. మృతుల కుటుంబీకులు, దగ్గరి బంధువులు స్నానాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. స్నానాల గదులు, దహన సంస్కార షెడ్డు నిర్మించడంతో పాటు ప్రహరీ నిర్మించి ఏడాది కావొస్తున్నా వాటిని వినియోగంలోకి తేనందున నిరుపయోగంగా ఉన్నాయి.
కోతులు, కుక్కలతో భయం భయం
పట్టణ ప్రజలు కోతులు, కుక్కలతో భయం భయంగా జీవిస్తున్నారు. చిన్న పిల్లలు బయట తిరగలేని, ఇంటి బయట ఆడుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సుమారు రెండేళ్ల క్రితం పట్టణంలోని శివాలయం వీధిలో తొమ్మిదేళ్ల బాలుడు ఓ భవనంపై ఆడుకుంటుండగా అక్కడికి కోతుల గుంపు వచ్చింది. వాటి నుంచి తప్పించుకునేందుకు భయంతో కిందకు దూకడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. పట్టణంలో రోజు 15 నుంచి 20 మంది ప్రజలు కోతులు, కుక్కల బారిన పడి గాయాలపాలవుతున్నారు.
ప్రధాన రోడ్లు అధ్వానం
పట్టణంలో ప్రధాన రోడ్లు అధ్వానంగా మారాయి. గత పాలక కమిటీ హయాంలో జనరల్ ఫండ్ నుంచి ప్రతి వార్డులో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ప్రధాన రోడ్లను పట్టించుకోలేదు. కొత్తగా ఏర్పడిన పలు కాలనీల్లో ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి. లింకు రోడ్లు సైతం నిరుపయోగంగా మరాయి. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ అసంపూర్తిగా ఉండడంతో ప్రతి శుక్రవారం సంత రోజు వ్యాపారులు రోడ్లపై కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే పట్టణం మీదుగా ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మించిన మురికి కాలువ, ఫుట్‌పాత్‌లను పక్కనే ఉన్న వ్యాపారులు ఆక్రమించినా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
భగీరథ ఉన్నా దాహం దాహం
మిషన్ భగీరథ పథకం అమలులో ఉన్నా పట్టణంలోని పలు కాలనీల్లో నీటికి కటకట తప్పడం లేదు. ఒక మనిషికి రోజుకు 135 లీటర్ల తాగు నీరు ప్రభుత్వం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రజలకు రోజుకు 25 లక్షల 44 వేల లీటర్ల నీరు కావాల్సి ఉంది. అయితే అధికారులు 17 లక్షల లీటర్ల నీరు సరఫరా చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారులు సమస్యను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వేసవి సీజన్ వస్తున్నందున ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగం
పట్టణంలో మూడు చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. ఎస్‌బీఐ ఎదురుగా నిర్మించిన టాయిలెట్ సముదాయాన్ని వినియోగంలోకి తెచ్చిన మున్సిపల్ అధికారులు సుమారు రూ. 24 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, స్థానిక చౌరస్తాలో తూప్రాన్ రోడ్డు పక్కన నిర్మించిన రెండు సముదాయాలను వినియోగంలోకి తేకపోవడంతో అవి నిరుపయోగంగా మారాయి. వాటికి నీటి సదుపాయం లేనందునే వినియోగంలోకి తేవడం లేదని తెలిసింది.
హరితహారం రికార్డులకే పరిమితం
అధికారులు హరితహారం పథకాన్ని నీరుగారుస్తున్నారు. నర్సరీల నిర్వహణను పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఇతర ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కుబడిగా మొక్కలు తెచ్చి పట్టణంలో పంపిణీ చేశారు. గతేడాది ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఇచ్చామని అధికారులు చెప్పినా.. పట్టణంలో వెయ్యి ఇళ్లకే మొక్కలు పంపిణీ చేశారు. రికార్డుల్లో మాత్రం ఎక్కువ రాసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే జాతీయ రోడ్డు పక్కన నాటిన మొక్కలు ఎండిముఖం పట్టాయి.
పార్కులులేక
ఆహ్లాదం దూరం
గతంలో మేజర్ పంచాయతీగా కొనసాగిన నర్సాపూర్ 2018లో మున్సిపాలిటీగా మారింది. కాగా పట్టణంలో ఒక్క పార్కు లేకపోవడం విచారకరం. పట్టణ ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదంగా గడపాలంటే పార్కు లేని లోటు కన్పిస్తుంది. గతంలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కు నిరాదరణకు గురవుతుంది. అందులో పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు కరువయ్యాయి.
ప్రభుత్వ భవనాలు అసంపూర్ణం
మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలిపోయాయి. మున్సిపాలిటీ కార్యాలయం నిధులు లేక నాలుగున్నరేళ్లుగా నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే ఇంటిగ్రేటేడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ యార్డు భవనం పనులు సైతం నిధులు లేక సుమారు పది నెలలుగా పనులు నిలిచిపోయాయి. గౌడ సంఘం భవనం, అధునాతన దోబిఘాట్, ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు సైతం నిలిచిపోయాయి.
చివరికి ఇలా..
చిన్నశంకరంపేట(మెదక్): వరి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు భగీరథ య త్నం చేస్తున్నాడు. రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని వినియోగించి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నా ర్సింగి మండలంలోని నర్సంపల్లి పెద్దతండాకు రైతు భాషానాయక్ మూడెకరాల్లో వరి సాగు చేశాడు. మొదట్లో రెండు బోర్లు పుష్కలంగా నీరుపోస్తున్నాయని, వరి సాగుకు మొగ్గు చూపగా పంట ఏపుగా పెరిగింది. పంట చేతికొస్తుందనుకున్న సమ యంలో రెండు బోర్లలో నీరు తగ్గిపోయింది. పచ్చనిపంట కళ్లముందే ఎండిపోయి పశువులమేతకు పెట్టడం ఇష్టం లేక ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కనీసం పెట్టుబడి అయినా మిగిలించుకోవాలనే తాపత్రయ పడుతున్నాడు.
కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు
మెదక్ కలెక్టరేట్: జాతీయ నూతన విద్యా విధానంతో ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రం ప్రభుత్వం వెంటనే ఆపాలని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అన్నపూర్ణ, నర్సమ్మ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు పలు డిమాండ్లతో మెదక్ కలెక్టరేట్ వద్ద సోమవారం 48 గంటల ధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మినీ టీచర్స్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. 50 యేళ్లుగా ఎన్నో సేవలతో అందరి మన్ననలు పొందుతున్న ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే పీఎం శ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జాతీయ నూతన విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఆపాలని కో రారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఐసీడీఎస్‌ను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంగన్‌వాడీ వ్యతిరేక విధానాలను అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూడటం అన్యాయమన్నా రు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం, సంతోష్, అంగన్‌వాడీ నాయకురాలు రాజ్యలక్ష్మి, స్వప్న విజయ, ఇందిరా, లక్ష్మి, రాణి, కల్పన, జ్యోతి, అరుణ, నాగరాణి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు భారీగా పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్లీడర్‌గా శోభన్‌గౌడ్
మెదక్ కలెక్టరేట్: జిల్లా కోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా మెదక్ పట్టణానికి చెందిన శివనూరి శోభన్‌గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ సివిల్ కోర్టు, జూనియర్ సివిల్ కోర్టులో ప్రభుత్వం తరఫున ఆయన వాదించనున్నారు. ఈసందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపినట్లు శోభన్ గౌడ్ తెలిపారు.
న్యూస్‌రీల్
కలగానే స్టేడియం నిర్మాణం
నర్సాపూర్ మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడే ఇండోర్, మిని స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో 2013లో అప్పటి మంత్రులు శ్రీధర్‌బాబు, సునీతారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడంతో క్రీడాకారులు, వాకర్స్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా ఏర్పాటు చేసిన పట్టణ క్రీడా ప్రాంగణాలు కొన్ని నెలలకే కనుమరుగయ్యాయి.
మున్సిపాలిటీ వివరాలు
ఏర్పడిన సంవత్సరం 2018
ఇళ్లు 6,742
వార్డులు 15
రెవెన్యూ బ్లాకులు 20
జనాభా 18,845
వాటర్ ట్యాంకులు 31
పబ్లిక్ టాయిలెట్స్ 03
వీధి దీపాలు 2,800
బస్తీ దవాఖానాలు 03
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
ప్రగతిలో నర్సాపూర్
Comments
Please login to add a commentAdd a comment