● నా అనుమతి లేకుండా ఆఫీసులోకి ఎలా వచ్చావ్..?
● సాక్షి విలేకరిపై పీఆర్ సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తన
● కార్యాలయంలో ఒకే ఒక్కడు.. సమయపాలన పాటించని సిబ్బంది
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరు ఎప్పుడు కార్యాలయానికి వస్తారో.. ఎవరుంటారో తెలియడం లేదు. అసలే అవినీతి, ఆరోపణలతో అభాసుపాలవుతున్న ఈ కార్యాలయంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో సంబంధిత అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా తయారైంది. ప్రస్తుతం ఈ కార్యాలయంలో డీఈ, ఏఈ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉన్నారు. డీఈ సెలవుపై వెళ్లడంతో కార్యాలయంలో సిబ్బంది ఉండటం లేదు. మంగళవారం ఉదయం 11 గంటలు దాటినా ఒక్కరే కార్యాలయానికి వచ్చారు. ఈ విషయమై ‘సాక్షి’విలేకరి ఫొటోలు తీస్తుండగా.. సీనియర్ అసిస్టెంట్ అంజయ్య అభ్యంతరం తెలిపారు. ‘‘నా అనుమతి లేకుండా ఫొటోలు ఎలా తీస్తావ్..అసలు నువ్వెవరు..? పర్సంటేజీలు తీసుకుంటున్నారని వార్త రాశావ్ కదా.. నీ ఇష్టం వచ్చింది రాస్కో’’అంటూ దురుసుగా ప్రవర్తించారు. పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి ఇటీవల సాక్షి వెలుగులోకి తేవడంతో అధికారులు, సిబ్బంది జీర్ణించుకోలేక పోతున్నారు. సీనియర్ అసిస్టెంట్ దురుసు ప్రవర్తనపై మెదక్ ఈఈ నర్సింలుకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.