
పారదర్శక రెవెన్యూ పాలన అవసరం
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: పారదర్శక రెవెన్యూ పాలనే లక్ష్యంగా తహసీల్దార్లు జవాబుదారితనంతో పనిచేయా లని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ భుజంగరావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ధరణి, ప్రభుత్వ భూములను పరిరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు పారదర్శక రెవెన్యూ పాలన అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. ధరణి స్పెషల్ డ్రైవ్ చేపట్టి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులపై ప్రణాళిక బద్ధమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలతో కార్యాలయానికి వచ్చిన ప్రజలను సముదాయించి సమాధానం ఇవ్వాలని సూచించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు భద్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో శ్రీనో హెల్మెట్ నో ఎంట్రీశ్రీ అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్లాస్టిక్ నిషేధం పక్కాగా అమలు జరగాలని స్పష్టం చేశారు.
భక్తులకు నీడ కల్పించండి
పాపన్నపేట(మెదక్): వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఏడుపాయల్లో చలువ పందిళ్లు వేసి భక్తులకు నీడ కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఏడుపాయల్లో పర్యటించారు. ఆది, మంగళ, శుక్రవారాల్లో భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నందున రాజగోపురం నుంచి అమ్మవారి ఆలయం వరకు చలవ పందిళ్లు వేయాలని సూచించారు. అదే విధంగా నేలపై మ్యాట్‌లు వేసి నీరు పోయాలని చెప్పారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో పరిస్థితులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.