
ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
శివ్వంపేట(నర్సాపూర్): యాసంగి వరి పంటలు నీరందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం పరిహా రం ఇచ్చి ఆదుకోవాలని రైతు రక్షణ సమితి జిల్లా గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్, ఉపాధ్యక్షుడు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించి మాట్లాడారు. పంటలకు పలు చీడ పురుగులు సోకడంతో పాటు భూగర్భజలాలు అడుగంటిపోయి ఎండిపోయాయన్నారు. ఎండిన పంటల వివరాలు ప్రభుత్వం సేకరించి ఎకరాకు రూ. 30 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు పంట చేతికి రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా సైతం రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను అన్ని విధాలుగా అదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.