కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పునః ప్రారంభం నాటికి మరమ్మతులను వెంటనే పూర్తి చేయించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మక విద్య అందించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలు, పాఠశాలల్లో సమస్యలుంటే వెంటనే సంబంధిత సీనియర్ అధికారికి వివరించాలని సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య పరిష్కారానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి చంద్రకళ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి పరిశీలన
రామాయంపేట(మెదక్): మెదక్– సిద్దిపేట జాతీయ రహదారిలో తొనిగండ్ల ఫారెస్ట్ బ్రిడ్జి నాణ్యతను కలెక్టర్ రాహుల్‌రాజ్ శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక రోడ్డు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేయాలని సూచించారు.