తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందుకు ఖర్చు చేసిన నిధుల వివరాలను రైతులకు తెలియజేయాలని సర్కారు నిర్ణయించింది. రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాలు, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. గ్రామాల వారీగా ఎన్ని కోట్లు ఇచ్చాం.. ఏ రైతుకు ఎంతమేర లబ్ధి చేకూరింది అనే విషయాలను గ్రామస్తులు చర్చించుకునేలా చూడాలని ప్రణాళికలు రచిస్తోంది. ఉగాది నాటికి ఈ పక్రియను పూర్తి చేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. – మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా సుమారు 4 లక్షల ఎకరాల సాగుభూములు ఉండగా, వాటిలో ఏటా 3.95 లక్షల ఎకరాలను 2.91 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో కనీసం 300 నుంచి 500 వందలకు తగ్గకుండా రైతులు ఉంటారు. వీరిలో రుణమాఫీ వర్తించిన వారు తక్కువ మంది ఉన్నా, రైతు భరోసా అందిన వారు 90 శాతానికి పైగా ఉంటారు. కాగా ఫ్లెక్సీల్లో రైతు పేరు, తండ్రి పేరు, భూమి, బ్యాంకు అకౌంట్, రుణమాఫీ ఎంత అయింది.. రైతు భరోసా కింద ఎంత జమ అయిందనే పూర్తి సమాచారం ఫ్లెక్సీల్లో ముద్రించనున్నట్లు సంబంధిత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కాగా ఒక్కో ఫ్లెక్సీ సైజు ఆరు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పుతో ఉండనుందని తెలిసింది. దీంతో 500 మంది రైతులు ఉన్న గ్రామంలో అందరి పేర్లు ముద్రించాలంటే కనీసం 5 ఫ్లెక్సీలు అవసరం పడనున్నాయి. అలాగే ప్రతి గ్రామంలోని మూడు ప్రధాన కూడళ్ల వద్ద వీటిని ప్రదర్శించాలంటే కనీసం 15 ఫ్లెక్సీలు కావాలి. ఈ లెక్కన జిల్లాలో 493 గ్రామాలకు గానూ 7,393 ఫ్లెక్సీలు అవసరం ఉంటాయి. ఒక్కో ఫ్లెక్సీకి ప్రభుత్వం రూ. 300 చొప్పున ఇవ్వనున్నట్లు సమాచారం.
రుణమాఫీ రూ. 654.12 కోట్లు
జిల్లాలో 2.91 లక్షల మంది రైతులు ఉండగా, రూ. 2 లక్షల లోపు అర్హులైన 88,683 మంది రైతులకు నాలుగు విడతల్లో కలిపి రూ. 654.12 కోట్ల నిధులు జమ చేసింది. అలాగే ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి 2,54,238 మంది రైతులకు రైతు భరోసా కింద ఒక్కో ఎకరాకు రూ. 6 వేల చొప్పున జిల్లాకు రూ. 193 కోట్ల నిధులు వచ్చాయి.
రైతుల ఓట్లే కీలకం!
రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము చేసిన పనులను ఊరూవాడా చర్చించుకోవాలనే ఈ ఆలోచనకు తెరతీసినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే రైతుల ఓట్లే కీలకమని భావిస్తోంది.
రుణమాఫీ, రైతు భరోసాలబ్ధిదారుల పేర్లు ప్రదర్శన గ్రామాలు, ప్రధాన కూడళ్లలోఫ్లెక్సీల ఏర్పాటుకు నిర్ణయం వ్యవసాయశాఖ అధికారులకుఅందిన ఆదేశాలు
ఉగాది నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు
ఆదేశాలు వచ్చాయి
జిల్లావ్యాప్తంగా రుణమాఫీ, రైతు భరోసా లబ్ధిదారుల పేర్లను ఫ్లెక్సీల్లో ముద్రించి గ్రామాల్లో ప్రదర్శించాలని తమకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు సంబంధించి కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొని ఫ్లెక్సీల్లో లబ్ధిపొందిన రైతుల పేర్లను ముద్రణ చేపడతాం.
– వినయ్,
జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయ అధికారి
ఏం చేశాం.. ఎంత ఇచ్చాం!