
వ్యవసాయ రంగానికి పెద్దపీట
నర్సాపూర్: వ్యవసాయ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలకు రుణాలు ఇవ్వడంలో పెద్ద పీట వేస్తున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) సీఈఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం డీసీసీబీ శాఖలో రికవరీ, బ్యాంకు కార్యకలాపాలు పరిశీలించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 50 డీసీసీబీ శాఖల ద్వారా ఏడు వందల కోట్ల డిపాజిట్లు సేకరించామని, 18వందల కోట్ల రుణాలు అందజేశామని తెలిపారు. కాగా రుణాల రికవరీ 84శాతం వసూలు చేశారని చెప్పారు. రైతులకు వ్యవసాయానికే కాకుండా తదితర రుణాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో స్థానిక బ్రాంచ్ మేనేజర్ అభినవ్, ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణాకర్ రావు, ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్ పాల్గొన్నారు.
పాఠశాలకు సహాయం
థాయిలాండ్ ప్రతినిధుల హామీ
చిన్నశంకరంపేట(మెదక్): మండలంలోని జంగరాయి ప్రాథమికోన్నత పాఠశాలను థాయిలాండ్‌కు చెందిన సింజెంటా సీడ్ కంపెనీ ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తమ సంస్థ ద్వారా పాఠశాలకు అవసరమైన సహాయం అందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు. పాఠశాలకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరగా, అంగీకరించినట్లు హెచ్‌ఎం నాగసుజాత తెలిపారు.
పశుపోషణపై అవగాహన
పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య
నర్సాపూర్‌రూరల్: పశు పోషణపై ప్రతి రైతుకు అవగాహన అవసరమని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వెంకటయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నత్నాయిపల్లిలో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్, పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేతలో మినరల్ మిక్చర్, ఖనిజ మిశ్రమం, కాల్షియం వంటివి ఉండేలా చూసుకోవాలన్నారు. పశువులకు కావాల్సిన మందులు, పశుగ్రాసం విత్తనాలు నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఉచితంగా అందజేసింది. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ జనార్దన్, పశువైద్యాధికారులు సౌమిత్, ప్రియాంక, స్వప్న, నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ సభ్యులు గజేంద్రియన్, రాజకుమార్, రామకృష్ణ, వీరేశ్ పాల్గొన్నారు.
మార్కెట్ ప్రకారమే పరిహారం
నర్సాపూర్: సంగారెడ్డి కెనాల్‌లో భూములు కోల్పోతున్న రైతులు మార్కెట్ ప్రకారమే పరిహారం చెల్లించాలని ఆర్‌డీఓ మహిపాల్‌ను కోరారు. మంగళవారం శివ్వంపేట మండలంలోని చిన్నగొట్టిముక్కుల గ్రామ రైతులతో అవార్డు సమావేశం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆర్డీవో హాజరై మాట్లాడుతూ గ్రామం మీదుగా కెనాల్ వెళ్తుందని, కాల్వ కోసం ప్రభుత్వం భూమి సేకరిస్తున్నామని చెప్పారు. తమ భూములకు మార్కెట్ ధరకు అనుగుణంగా పరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరూ, కాల్వ నిర్మాణానికి తమ భూములు తీసుకోవద్దని మరి కొంతమంది రైతులు ఆయనను కోరారు. రైతుల అభ్యర్థనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఆర్‌డీఓ వివరించారు. సమావేశంలో తహసీల్దార్ కమలాద్రి, ఆర్‌ఐ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
సీల్డ్ టెండర్ల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని 27 పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్స్ సరఫరా చేయడానికి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్ ఫారం ధర రూ.2 వేలు, ఈఎండీ ధర రూ.50 వేలు ఉంటుందన్నారు. టెండర్ ఫారాలు ఈ నెల 28 వరకు విద్యాశాఖ కార్యాలయంలో పొందాలని, పూర్తి చేసిన ఫారాలను బాక్స్‌లో వేయాలన్నారు. సీల్డ్ టెండర్లను ఈ నెల 29న ఉదయం 11గంటలకు జేపీసీ కమిటీ ఆధ్వర్యంలో తెరుస్తామని తెలిపారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీట

వ్యవసాయ రంగానికి పెద్దపీట