
అత్యవసర వైద్యం
మరింత చేరువగా
నర్సాపూర్: వైద్యారోగ్యశాఖలో కొత్త పాలసీని తీసుకొస్తున్నామని, రహదారులపై 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శుక్రవారం నర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 7,500 ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అంబులెన్స్‌లు సైతం అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందించి కాపాడుతామన్నారు. వ్యసనాలతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. పేదల కడుపు నింపడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, అందులో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా అర్హులైన పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు. మహిళా సాధికారతే ధ్యేయంగా బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. నర్సాపూర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్, ట్రామా సెంటర్, సీటీస్కాన్ సదుపాయాన్ని త్వరలో ప్రారంభించేందుకు చర్య లు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. చెక్కుల పంపిణీలో ఆరు నెలల పాటు కాలయాపన జరగడంతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మంత్రి వెళ్లిన అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మైక్ ఇవ్వాలని అడగ్గా అధికారులు ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగే ష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, ఆర్డీఓ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యం
రాజకీయాల్లో వ్యక్తిత్వం ముఖ్యమని మంత్రి దా మోదర అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను, సునీతారెడ్డి మంత్రులుగా కొనసాగామని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నారు. మహోన్నతమైన వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమని కొనియాడారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలన్నారు. సమన్వయంతో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చాలా ముఖ్యమని అన్నారు.
త్వరలో ట్రామా కేంద్రాల ఏర్పాటు
పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం
మంత్రి దామోదర రాజనర్సింహ