
రండి.. చూసొద్దాం
వేసవి సెలవుల్లో ఎటైనా టూర్‌కు వెళితే బాగుంటుందని అందరూ భావిస్తుంటారు. దూరప్రాంతాల్లో కాకుండా దగ్గర్లో ఉంటే అనువుగా ఉంటుందని కోరుకుంటారు. అలాంటి వారికి జిల్లాలో కొలువుదీరిన ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు రారమ్మని పిలుస్తున్నాయి. సరస్సులు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, అభయారణ్యాలు ఒకటేమిటి.. ఇలా ఎన్నింటినో చూసే వీలుంది. హైదరాబాద్ నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఇంకెందుకు ఆలస్యం.. మెతుకుసీమ పర్యాటక, దర్శనీయ స్థలాలను చుట్టేసేందుకు సిద్ధం కండి. – మెదక్‌జోన్
మెతుకుసీమలో ఎన్నో పర్యాటక, దర్శనీయ స్థలాలు సొంత వాహనం ఉంటే వెళ్లొచ్చు హాయిగా.. అందుబాటులోనూ బస్సు సౌకర్యం
నర్సాపూర్ అర్బన్‌పార్కు
హైదరాబాద్‌కు అతి సమీపంలో నర్సాపూర్ అర్బన్ పార్కు ఉంది. మండు వేసవిలోనూ పచ్చటి అడవి అందాలు, స్వచ్ఛమైన గాలి ఇక్కడ సొంతం.అడవి లోపలిభాగంలో సహజ సిద్ధ మట్టిరోడ్లు, ఆకాశాన్ని అందుకునే విధంగా పెరిగిన చెట్లు, అడవి అందాలను తిలకించేందుకు నిర్మించిన వాచ్‌టవర్లు, పార్కును ఆనుకొని తొణకిసలాడే రాయరావు చెరువు చూడదగిన అందాలు.
పోచారం అభయారణ్యం
మెదక్ పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పోచారం అభయారణ్యం ఉంది. అందులో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం కొనసాగుతోంది. వాటితో పాటు అనేక రకాల జంతువులు ఉన్నాయి. ప్రవేశ రుసుం పెద్దలకు రూ. 100, చిన్న పిల్లలకు రూ. 50 చెల్లించాలి. కెమెరా తీసుకెళ్తే అదనంగా మరో రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. చెంగుచెంగున దుమికే చుక్కల జింకలు, పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు, కొండగొర్లు, నీల్గాయిలాంటి ఎన్నో రకాల జంతువులు కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలాగే అభయారణ్యాన్ని ఆనుకొని కొండలు, గుట్టల నడుమ నిజాం హయాంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు చూడదగినది. దీనిని 1916–1922 మధ్య మంజీరా నదికి ఉపనదిగా ఆలేరుపై నిర్మించారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్న ద్వీపం వివిధ జాతుల పొదలకు నిలయం.
ప్రఖ్యాతిగాంచిన చర్చి
దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సందర్శించే చర్చిలలో ఒకటి మెదక్ చర్చి ఒకటి. దీనిని బ్రిటిష్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ నిర్మించారు. 1914 నుంచి 1924 వరకు పదేళ్ల పాటు దీనిని నిర్మించారు. ఇది చరిత్రాక కట్టడం. చర్చి గోపురం ఎత్తు 175.. పొడవు 200 అడుగులు, వెడల్పు 100 అడుగులు ఉంటుంది. తూర్పున ఏసు క్రీస్తు జన్మవృత్తాతం, పడమర క్రీస్తును శిలువ వేసిన.. ఉత్తరాన క్రీస్తు చనిపోయి 3వ రోజు సజీవుడైన దృశ్యాలు కనిపిస్తాయి. పైమూడు దృశ్యాలు పగలు మాత్రమే కనిపించడం ప్రత్యేకత.
ఏడుపాయల దుర్గమ్మ
ఋషులు తపస్సు చేసిన కీకారణ్యం రాతి గుహలో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం వెలిసింది. ఈ ఆలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. వనదుర్గమ్మ దర్శనానికి ఏటా 30 లక్షలకుపైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివస్తారు. ఆది, మంగళవారాల్లో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతాయి.
మెదక్ ఖిల్లా
మెదక్ ఖిల్లా (కోట) ఒక వారసత్వ నిర్మాణం. 2వ శతాబ్దంలో కాకతీయుల ఆఖరిరాజు ప్రతాపరుద్రుడి హయాంలో ఈ కోట నిర్మించబడిందని చరిత్ర చెబుతుంది. దీనిని మొదట తెలుగులో ‘మెతుకుదుర్గం’ అని పిలిచేవారు. ఇది కాకతీయుల తర్వాత కుతుత్‌షాహిలకు కమాండ్ పోస్టుగా పనిచేసింది. ఈ కోటలో కుతుబ్‌షాహిస్ నిర్మించిన ప్రాంగణంలో 17వ శతాబ్దపు మసీదు, అలాగే ధాన్యాగారాలు ఉన్నాయి. ఇది భూమట్టం నుంచి సుమారు 90 మీటర్ల ఎత్తులో కొండ ప్రాంతంలో 100 ఎకరాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్ నుంచి ఒకటిన్నర గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు.

రండి.. చూసొద్దాం

రండి.. చూసొద్దాం

రండి.. చూసొద్దాం

రండి.. చూసొద్దాం