
సంతృప్తిగా సన్నబువ్వ
కలెక్టర్ రాహుల్‌రాజ్
బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
టేక్మాల్(మెదక్): సన్నబియ్యంతో భోజనం సంతృప్తిని ఇచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని చంద్రుతండాలో పంచాయతీ కార్మికుడు రమావత్ పీరియ ఇంట్లో సన్నబియ్యం భోజనం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉగాది సందర్భంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. పేదలందరికీ పూర్తిస్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్లలో స్వయంగా ఆనందాన్ని చూశానని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాక్ చేరినట్లు వివరించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, తహసీల్దార్ తులసీరాం, ఎంపీడీఓ విఠల్, ఆర్‌ఐ సాయి శ్రీకాంత్, ఎంపీఓ రియజొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
రేపు అధికారికంగా పూలే జయంతి
మెదక్ కలెక్టరేట్: ఈనెల 11వ తేదీన మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధ్యాన్‌చంద్ చౌరస్తాలో గల జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పా ల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో క్రికెట్, మరే ఇతర బెట్టింగులకు పాల్పడినా, ప్రోత్సహించిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని యువతకు సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లతో అప్పుల పాలై ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్ సీజన్ ప్రారంభమైందని తెలిపారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలపై నిఘా పెట్టాలన్నారు. ఎవరైన బెట్టింగులకు పాల్పడినట్లుగా తెలిస్తే తక్షణమే డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 8712657888 నంబర్‌కు సమా చారం అందించాలని సూచించారు.