
మహనీయుడు జ్యోతిబా పూలే
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: కుల, మతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించడానికి యువత నడుం బిగించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని కలెక్టరేట్‌లో నిర్వహించగా.. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, వివిధ బీసీ సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పూలే దంపతులు సమాజ హితం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ప్రభుత్వం సమీకృత గురుకులాలు ఏర్పాటు చేసి అన్నివర్గాల పిల్లలు విద్యనభ్యసించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో సుమారు 4,500 మందికి రూ. 50 కోట్లతో స్వయం ఉపాధి రుణాలు సబ్సిడీతో ఇస్తున్నామన్నారు. అనంతరం సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. సమాజ రుగ్మతలను రూపుమాపేందుకు జ్యోతిబా పూలే నిరంతరం పోరాడరని తెలిపారు. అంతకుముందు పట్టణంలోని ధ్యాన్‌చంద్ చౌరస్తాలో జ్యోతిబా పూలే విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్, సెక్రటరీ రాజ్‌కుమార్, డీపీఓ యాదయ్య, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా బీసీ సంఘం గౌరవ అధ్యక్షుడు మెట్టు గంగారం, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు నోముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి
హవేళిఘణాపూర్/మెదక్ కలెక్టరేట్: వర్షాలు కు రిస్తే ధాన్యం తడిసిపోకుండా రైతులకు టార్పాలి న్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మెదక్ మండల పరిధిలోని శివ్వాయిపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతుల నుంచి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తరలింపులో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో..
మెదక్ మున్సిపాలిటీ: కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పూలే అంటరాని తనం, కుల వ్యవస్థ నిర్మూలనకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

మహనీయుడు జ్యోతిబా పూలే