
స్కాన్ చెయ్.. టికెట్ తీస్కో..
మెదక్ మున్సిపాలిటీ: ‘టికెట్‌కు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్‌కు సహకరించగలరు’ అనే నినాదానికి ఇక నుంచి ఆర్టీసీ సంస్థ స్వస్తి పలకనుంది. వేధిస్తున్న చిల్లర సమస్యను తట్టుకునేందుకు బస్సుల్లో నగదు రహిత సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రతి బస్సులో ఈ–టిమ్ యంత్రాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో ప్రయాణికులు, కండక్టర్ల మధ్య చిల్లర గొడవ తీరిపోనుంది. గతంలో చిల్లర లేక కండక్టర్లు ఇతర ప్రయాణికులతో డబ్బులు జత చేసి ఇవ్వడంతో ఇబ్బందులు ఎదురయ్యేవి.
మెదక్ డిపోకు 80 ఈ–టిమ్ మిషన్లు
మెదక్ డిపోలో మొత్తం 94 బస్సులు ఉండగా, ఇందులో 39 ప్రభుత్వ, 55 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. వీటి కోసం ఆర్టీసీ యాజమాన్యం 80 నగదు రహిత ఈ–టిమ్ యంత్రాలను మెదక్ డిపోకు కేటాయించినట్లు డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ యంత్రాలతో (ఫోన్ పే, గూగుల్ పే) నగదు రహిత ఆన్‌లైన్ యాప్ ద్వారా స్కాన్ చేయవచ్చని తెలిపారు. అలాగే డెబిట్ కార్డులతో స్వైపింగ్ చేసి టికెట్ తీసుకునే సౌకర్యం ఆర్టీసీ కల్పించిందన్నారు. డిపోలో ప్రస్తుతం ఈ–టిమ్ యంత్రాలను సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. మిగితా యంత్రాలను త్వరలోనే అన్ని బస్సుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు.
ఆర్టీసీలో నగదు రహిత సేవలు
ప్రస్తుతం సూపర్ డీలక్స్ బస్సుల్లో ప్రారంభం
దశలవారీగా అన్ని సర్వీసుల్లో అమలు