
తాగునీటి సరఫరాకు ప్రణాళిక
● పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ
● అధికారులతో కలెక్టర్ రాహుల్‌రాజ్ సమీక్ష
మెదక్ కలెక్టరేట్: ఎండలు మండుతున్నందున గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రత్యేక సమ్మర్ యాక్షన్ ప్లాన్ రూపొందించి తద్వారా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తాగునీరు ఇబ్బందులు తొలగించి, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. రానున్న రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో తాగునీటి సరఫరాను ప్రతిరోజు పర్యవేక్షించాలని, అవసరమైన చోట్ల ప్రత్యామ్నాయ ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
వారం రోజుల్లో పూర్తి చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో దారిద్య రేఖ కు దిగువన ఉన్న కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి లబ్ధిదారుల జాబితా తయారు చేయాలని, గెజిటెడ్ అధికారులను విచారణ అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు. ప్రతి గెజిటెడ్ అధికారికి 200 మంది లబ్ధిదారుల జాబితా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి రోజు కనీసం 25 మంది లబ్ధిదారుల విచారణ చేపట్టి ఈ ప్రక్రియను ఎనిమిది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్‌ఓ భుజంగరావు, హౌసింగ్ పీడీ మాణిక్యం, ఆర్‌డబ్ల్యఎస్, మిషన్ భగీరథ అధికారులతోపాటు మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీ సర్స్, ఎంపీడీవోలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
మెదక్ జోన్: సాక్షి కథనంపై కలెక్టర్ రాహుల్‌రాజ్ స్పందించారు. మంగళవారం రాత్రి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. నిర్వాహకులు ప్రతి రోజు కేంద్రాలను పర్యవేక్షించాలన్నారు. ఐకేపీ, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన వెంటనే ఓపీఎంఎస్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయాలని, తద్వారా సకాలంలో రైతులకు డబ్బులు అందుతాయని, అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కువ రోజుల వరకు కేంద్రంలోనే పెట్టుకోకుండా తేమ శాతం రాగానే కాంటా పూర్తిచేసి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు రోజుకు ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం భూ భారతి పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ భుజంగరావు, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూప్రాన్ ఆర్డీఓ చంద్రారెడ్డి, నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.