
డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన
తూప్రాన్: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొత్త విధానాలు తీసుకురావడం కారణంగా ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని డాక్యుమెంట్ రైటర్లు శనివారం ఆందోళనకు దిగారు. వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దుకాణాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డాక్యుమెంట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని రద్దు చేసి, పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాలు లేక స్వయం ఉపాధి పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానంతో 30 వేల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రాజ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. డాక్యుమెంట్ రైటర్లు బంద్‌తో క్రయవిక్రయదారులు లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు ప్రశాంత్, అఫ్రోజ్, శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్, హరీష్, అశ్విన్ తదితరులు పాల్గొన్నారు.