
దుర్గమ్మ సేవలో జడ్జి
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మను శనివారం జిల్లా జడ్జి లక్ష్మీశారద దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం ఆమెకు సిబ్బంది, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ అధికారి ప్రతాప్‌రెడ్డి సత్కరించారు. ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
చివరి గింజ వరకు కొంటాం
నర్సాపూర్/చిలప్‌చెడ్: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. శనివారం మండలంలోని రెడ్డిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని చెప్పారు. ఆయన వెంట జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్, ఐపీఎం గౌరిశంకర్ ఇతర సిబ్బంది ఉన్నారు. అనంతరం చిలప్‌చెడ్ మండలంలోని సామ్లా తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. లారీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
రజతోత్సవ సభకు
తరలిరండి
పెద్దశంకరంపేట(మెదక్): ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు భారీగా తరలిరావాలని ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పెద్దశంకరంపేటలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య రానీయొద్దు
చిన్నశంకరంపేట(మెదక్): గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. శనివారం నార్సింగి మండల పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కార్యాలయ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రాజీవ్ యువ వికాసం దర ఖాస్తులపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల గురించి ఎంపీడీఓ ఆనంద్‌ను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తపై కేసు
రామాయంపేట(మెదక్): సోషల్ మీడియాలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు వ్యతిరేకంగా పోస్టు పెట్టినందుకు గాను బీఆర్‌ఎస్ కార్యకర్త నర్సింగరావుపై శనివారం రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నర్సింగరావు అసభ్య పదజాలం వాడుతూ పోస్టు పెట్టాడని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు నర్సింగరావుకు నోటీస్ ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని నర్సింగరావు ఆరోపించారు. కేటీఆర్, హరీశ్‌రావు తనను కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని సీఐ వెంకట్‌రాజాగౌడ్ హెచ్చరించారు.

దుర్గమ్మ సేవలో జడ్జి

దుర్గమ్మ సేవలో జడ్జి

దుర్గమ్మ సేవలో జడ్జి