
సబ్సిడీ టార్పాలిన్లు ఏవీ?
రామాయంపేట(మెదక్): ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో 50 శాతం సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేవారు. ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో నానా పాట్లు పడుతున్నారు. అద్దె టార్పాలిన్ల కోసం రూ. వేలు ఖర్చు చేస్తూ అదనపు భారం మోస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయశాఖ అధికారులు టార్పాలిన్లు ఇచ్చే వారు. ఎనిమిది ఫీట్ల పొడవు, ఆరు ఫీట్ల వెడల్పు ఉన్న టార్పాలిన్ల అసలు ధర రూ. 2,500 కాగా, ప్రభుత్వం రూ. 1,250కే రైతులకు అందజేసింది. రెండు, మూడేళ్ల పాటు ఈ పథకం కొనసాగగా, పెద్ద సంఖ్యలో రైతులు వాటిని కొనుగోలు చేశారు.
రైతులకు అదనపు ఖర్చు
ఏపీ నుంచి వచ్చిన వ్యాపారులు కొందరు జిల్లా పరిధిలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో 70 వరకు తాత్కాలికంగా టార్పాలిన్లు అద్దెకు ఇచ్చే దుకాణాలు ప్రారంభించారు. రైతుల ఆధార్ కార్డులు తమ వద్ద పెట్టుకొని టార్పాలిన్లు అద్దెకు ఇస్తున్నారు. ఒక్కోదానికి రోజూ రూ. 20 నుంచి రూ. 25 వరకు అద్దె తీసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం పడతాయి. దీంతో ప్రతి రోజూ రూ. 250 వరకు అదనపు భారం పడుతుంది. పంట నూర్పిడి చేయడం, ఆరబెట్టడం, సంచుల్లో నింపి కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించడానికి కనీసం 15 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. ఈ లెక్కన రైతులపై టార్పాలిన్ల అద్దె కోసం రూ. ఐదు వేల వరకు ఖర్చవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై టార్పాలిన్లు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
అన్నదాతల ఎదురుచూపులు
బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలు
అద్దెతో అదనపు భారం
ధాన్యం కాపాడుకునేందుకు నానాపాట్లు