
కొత్త చట్టంతో భూ సమస్యలకు చెక్
కలెక్టర్ రాహుల్‌రాజ్
వెల్దుర్తి(తూప్రాన్)/చేగుంట/చిన్నశంకరంపేట(మెదక్): నూతన ఆర్‌ఓఆర్ చట్టం భూ భారతితో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మాసాయిపేట మండల కేంద్రంలోని రైతువేదికలో భూభారతిపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన చట్టం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించడంతో పాటు రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను త్వరితగతిన నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల పరిష్కారానికి భూ భారతిలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. స్టోర్ రూం, స్టాక్ రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ జ్ఙానజ్యోతి, ఎంపీడీఓ విఘ్నేశ్వర్, ఏడీఏ పుణ్యవతి, గిర్దావర్ ధన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతువేదికలో కొత్త చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. చేగుంట మండలం కేంద్రంలో సైతం భూ భారతి చట్టంపై రైతులకు కలెక్టర్ అవగాహన కల్పించారు.
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
తూప్రాన్: ఇంటర్‌లో 468 మార్కులతో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన తూప్రాన్ గీతా కళాశాల విద్యార్థిని టి. కృతికను కలెక్టర్ రాహుల్‌రాజ్, ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం అభినందించారు. మాసాయిపేట మండల కేంద్రంలో భూ భారతి కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ను కృతికతో పాటు తల్లిదండ్రులు కలిశారు. ఈసందర్భంగా విద్యార్థినిని సన్మానించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి సేవ చేయాలన్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులతో పాటు కళాశాల యాజమాన్యం, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ మా చదువుల కోసం నాన్న ఇబ్బంది పడుతున్నారని, భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం సాధించి నాన్న కష్టంలో పాలుపంచుకుంటానని కృతిక పేర్కొంది.