
కొత్త చట్టంలో రికార్డుల సవరణ
కలెక్టర్ రాహుల్‌రాజ్
రైతులు ఎలాంటి ఇబ్బంది పడొద్దు
అదనపు కలెక్టర్ నగేష్
వెల్దుర్తి(తూప్రాన్)/నిజాంపేట(మెదక్): రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొత్త చట్టంలో రికార్డుల్లో తప్పు ల సవరణకు అవకాశం కల్పించిందన్నారు. సాదాబైనామా దరఖాస్తులు సైతం పరిష్కారం అవుతాయన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అప్పీలు వ్యవస్థ ఉందని, భూదార్ కార్డుల జారీ, ఇంటి స్థలాలు, ఆబాది, రైతులకు ఉచిత న్యాయ సహాయం ఈ చట్టంలో పొందుపర్చారన్నారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో మోసపూరితంగా నమోదై ఉంటే వాటిని రద్దు చేస్తామన్నారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వల్ల బడుగు, బలహీనవర్గాల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కార్యక్రమంలో తూ ప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, మండల ప్రత్యేక అధికారిణి నీలిమ, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఓ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. అలాగే నిజాంపేటలో ఏర్పాటు చేసిన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. కొత్త చట్టంతో చాలా వరకు సమస్యలు పరిష్కారమవుతాయని వివరించారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, డీపీఆర్‌ఓ రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
టేక్మాల్(మెదక్): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. గురువారం మండలంలోని ఎలకుర్తి, చల్లపల్లి గ్రామాల్లో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొల్లు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లకు పంపాలన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం పూర్తిగా ఆరిన తర్వాతే తూకం చేయాలని చెప్పారు. లారీలు, గన్నీ బ్యాగుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఎండల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లోనే ధాన్యం తూకం చేయాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

కొత్త చట్టంలో రికార్డుల సవరణ